
ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వృద్ధుడు మృతి
–వైద్యాధికారి లేకపోవడం వల్లే మృతి చెందాడంటూ వాదనకు దిగిన కార్మికులు
– సీరియస్ అయితే నేరుగా పెద్దాసుపత్రికి వెళ్లొచ్చన్న వైద్యాధికారి
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్లలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చిలంకూరుకు చెందిన వృద్ధుడు ఎన్. శేషయ్య(68) గురువారం మృతి చెందాడు. సకాలంలో వైద్యా«ధికారి ఆస్పత్రికి రాకపోవడంతోనే చికిత్స అందక తన తండ్రి మృతి చెందాడని మృతుడి కుమారుడు శ్రీనివాసులు వాపోయాడు. కార్మికులు , స్థానికుల కథనం మేరకు .. చిలంకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఆర్టీపీపీలోని మెయింటెనెన్స్ విభాగంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఈఎస్‌ఐ కార్డు ఉంది. ఇతని తండ్రి శేషయ్యకు జ్వరం రావడంతో గురువారం తన భార్య మునిలక్ష్మితో కలసి చిలంకూరు నుంచి ఆటోలో ఎర్రగుంట్లలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రికి వెళ్లాడు. అప్పటికి అక్కడ వైద్యా«ధికారి లేడు. సిబ్బంది కూడా పట్టించుకోలేదు. కొద్ది సేపటికే శేషయ్య మృతి చెందాడు. తరువాత వైద్యాధికారి విష్టు వర్ధన్‌రెడ్డి రావడంతో అక్కడే ఉన్న కార్మికులు ‘మీరు ఆలస్యంగా రావడంతోనే శేషయ్య మృతి చెందాడని వాదనకు దిగారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ఈఎస్‌ఐ కార్డులు ఉన్న వారు సీరియస్ అయితే వెంటనే నేరుగా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లొచ్చన్నారు. ఇక్కడ అత్యవసర మందులు లేవని తెలిపారు. ఎస్‌ఐ వెంకటనాయుడు ఆస్పత్రి వద్దకు వచ్చి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. చివరకు మృతుడి బంధువులు మృతదేహాన్ని చిలంకూరు గ్రామానికి తీసుకెళ్లారు.