కలెక్టరేట్‌లో నిజాం కాలం బావి
♦ చెక్కు చెదరని రాతి కట్టడం
♦ ఇంతకాలం చెత్తకుప్పగా వాడిన వైనం
♦ కలెక్టర్ చొరవతో పాత బావికి కొత్తరూపు
హన్మకొండ అర్బన్: ఈ మధ్యకాలంలో కలెక్టరేట్‌లోకి వచ్చిన వారికి అక్కడో బావి ఉందని తెలియదు. బావి మొత్తం మట్టి, చెత్తా చెదారంతో నిండిపోయింది. పిచ్చి మొక్కలు పెరిగి ఆనవాళ్లు లేకుండా పోయింది. వాస్తవానికి అక్కడ నిజాం పాలన కాలంలో తవ్వించిన పెద్ద బావి ఉంది. ప్రస్తుతం అర్బన్ కలెక్టరేట్‌లో సమావేశ మందిరం పక్కన ఉంది. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ భవనానికి 1856లో శంకుస్థాపన జరిగినట్లు డీఆర్వో కార్యాలయం భవనానికి ఉన్న శిలాఫలకం ద్వారా తెలుస్తోంది.
అయితో అప్పట్లో తవ్వించిన ఈ బావిని తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించారట. ప్రస్తుతం కలెక్టరేట్, క్యాంపు కార్యాలయం మొత్తం సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ రోజుల్లో స్థలం విస్తీర్ణం ఇంకా ఎక్కువ ఉండి చుట్టూ సాగు చేసేవారట. అప్పట్లో ఈ బావి నీరే ప్రధాన ఆధారంగా పనులు సాగేవి. కాలక్రమంలో పాలకులు, అధికారులు మారుతూ వస్తుండటం.. బోర్లు, నల్లాలు అందుబాటులోకి రావడంతో ఈ భావి అవసరాలు తగ్గాయి. దాదాపు 2008 బావికి బోరు బిగించి ఉండేది. తరువాత పూర్తిగా వదిలేశారు. కలెక్టరేట్ మధ్యలో వినియోగంలో లేని భావి ఉన్నందున దానిని పూడ్చివేయాలని అధికారులు భావించారు. దీంతో చెత్త, పాత భవనాల మట్టి తెచ్చి బావిని దాదాపు నింపేశారు.
చెక్కుచెదరని రాతి కట్టడం
కలెక్టరేట్‌లో ప్రస్తుతం పునరుద్ధరిస్తున్న నిజా కాలం నాటి రాతి కట్టడంతో ఉన్న బావి నిర్మాణం ఎంతో పటిష్టంగా ఉంది. వారం రోజులుగా మట్టి తొలగింపు పనులు జరగుతున్నాయి. 10 మీటర్లకు పైగా రాతి కట్టడం పూర్తిగా బయట పడింది. అయితే నిర్మాణంలో ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బందులు కూడా లేవు. ఒక్కరాయి కూడా ఇప్పటివరకు కదల్లేదు.
కలెక్టర్ చొరవతో..
జిల్లా మొత్తంలో చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, మరమ్మతు, రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్న సమయంలో నిజాంకాలం నాటి బావి విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అమ్రపాలి ఒకసారి పరిశీలించారు. రాతి, నిర్మాణం పటిష్టంగా ఉందని అధికారులు చెప్పడంతో బావి పునరుద్ధరణ పనులు ఆర్‌డబ్ల్యూస్ అధికారులకు అప్పగించారు. నీరు వచ్చేవరకు మట్టి తీయడంతో పాటు చుట్టూ కంచె ఏర్పాటు చేసి సందర్శకుల కోసం ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం క్యాంపు కార్యాలయం మొత్తం పచ్చని వనం తయారు చేశారు. దానికి నీటి అవసరాలు ఈ బావి నుంచే తీర్చాలని భావిస్తున్నారు.
ఈ రోజుల్లో కట్టడం సాధ్యం కాదు...- మల్లేశం, ఆర్‌డబ్ల్యూస్ ఇంజనీర్
కలెక్టరేట్‌లో ఉన్న బావి నిర్మాణం చాలా పటిష్టంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో అలాంటి బావి కట్టడం సాధ్యం కాదు. కలెక్టర్ చొరవతో పనులు మొదలు పెట్టాం. పూడికతీత పనులు సాగుతున్నాయి. అవరాన్ని బట్టి మరింత లోతు తీయడానికి ప్రయత్నిస్తాం. బావి నీరు వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. నీటి వినియోగంతోపాటు చారిత్రక కట్టడాన్ని కాపాడినట్లు అవుతుందని భావిస్తున్నాం.