old well
-
పెళ్లి వేడుకలో అపశ్రుతి
కుషినగర్: వివాహ వేడుక ఏకంగా 13 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా గ్రామంలో ఈ విషాద ఘటన బుధవారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పరమేశ్వర్ కుష్వాహా ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. ఆయన కుమారుడి పెళ్లిలో భాగంగా స్థానికంగా ‘మట్‌కోర్బా’ అనే శుభకార్యం నిర్వహిస్తారు. కుష్వాహా ఇంటికి 100 మీటర్ల సమీపంలోని ఒక పాడుబడ్డ బావి దగ్గర ఈ వేడుక కొనసాగుతోంది. ఆ వేడుక చూసేందుకు జనం గుమిగూడారు. మూసేసి ఉన్న ఒక బావి పై మహిళలు, చిన్నారులు కూర్చుని వేడుక చూస్తున్నారు. 70 ఏళ్ల క్రితంనాటి వినియోగంలో లేని పాత బావిపై దాదాపు పదేళ్ల క్రితం వేసిన స్లాబ్ పాడైంది. సామర్థ్యానికి మించి దానిపై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కూలింది. దీంతో 23 మంది బావిలో పడిపోయారు. హుటాహుటిన అక్కడి వారు లోపలి వారందరినీ పైకి తేగలిగారు. వారికి ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. 10 మంది గాయపడ్డారు. ఈ గ్రామాన్ని ఎంపీ విజయ్ దుబే గతంలో దత్తత తీసుకున్నారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని జిల్లా మేజిస్ట్రేట్ రాజలింగం చెప్పారు. ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. -
పురాతన బావిలో మంటలు..
సాక్షి, నారాయణఖేడ్: ప్రమాదశాత్తు పురాతన బావిలో అగ్నిప్రమాదం సంభవించగా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పి ప్రమాదాన్ని నివారించారు. ఈ ప్రమాదం పట్ల పట్టణవాసులు ఆందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణఖేడ్ పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన హనుమాన్ కాలనీలోని హనుమాన్ ఆలయం వద్ద పురాతన బావి ఉంది. చాలా కాలంగా బావిని ఉపయోగించకపోడంతో చెత్తా, చెదారం వేస్తుండడంతో బావిలో చెత్త నిండిపోయింది. గురువారం మధ్యాహ్నం బావిలో ఎవరూ మంటలు అంటించారో తెలీదు కానీ ఒక్కమారుగా మంటలు అంటుకున్నాయి. ఈ బావి పక్కనే ఓ ప్రధాన బ్యాంకు, హనుమాన్ ఆలయం, మరో వైపు పెట్రోల్‌బంక్, చుట్టూ నివాసగృహాలు ఉన్నాయి. ప్రమాదం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని స్థానికులు అగ్నిమాపకకేంద్రం అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
భద్రాద్రి జిల్లాలో ఏడు శతాబ్దాల నాటి బావి
అద్భుత కట్టడాలకు ఆలవాలం కాకతీయుల కాలం.. వారి శిల్పకళ ప్రతిభ అనిర్వచనీయం.. నిర్మించి శతాబ్దాలు దాటినా చెక్కుచెదరని నైపుణ్యం వారి సొంతం.. ఆ కోవలోకే వస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఉన్న కాకతీయులు నిర్మించిన రాజా బావి.. 14వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడి పాలనలో ఇక్కడి సామంతరాజులు నిర్మించిన ఆ బావి ఇంకా పదిలంగానే ఉంది. కానీ నేటి పాలకులు, అధికారులు పట్టించుకోక పోవడంతో చారిత్రక కట్టడం నిరాదరణకు గురవుతోంది. జూలూరుపాడు, భద్రాద్రి జిల్లా : శత్రుదేశాల సైన్యాల నుంచి రక్షించుకోవడానికి నాటి సామంతరాజులు ఒక రహస్య స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. అప్పట్లో దట్టమైన అడవి ఉన్న జూలూరుపాడును అనువైన ప్రాంతాంగా ఎంచుకున్నారు. అక్కడ నీటి అవసరాలకోసం సువిశాలమైన అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో రాతి కట్టడంతో రాజా బావిని నిర్మించారు. రాజా బావి పైభాగాన చుట్టూ 10గదులను నిర్మించారు. బావిలోకి మెట్లు 30 అడుగుల లోతు వరకు ఉంటాయి. ఈ బావికి చుట్టూ ఉన్న గదుల పై కప్పు 8 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ఒకే రాయి ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్నేళ్లు పూడిక తీయకపోవడంతో బావి లోతు ఎంత అనేది ఎవరికీ తెలియదు. ఆ రోజుల్లో ఈ బావిని డంగు సున్నం, రాళ్లతో కట్టడంతో నేటికీ ధృడంగా ఉంది. వరంగల్ వరకు సొరంగం..! సాధారణంగా రాజులు తమ రహస్య స్థావరాలకు సొరంగ మార్గాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగానే ఈ బావికి కూడా సొరంగ మార్గం ఇటు వరంగల్ కోట వరకు.. అటు ఖమ్మం ఖిల్లా వరకు ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాకతీయ రాజులు వజ్ర వైఢూర్యాలు, బంగారు అభరణాలను ఈ బావిలో ఉంచారని స్థానికంగా ప్రచారంలో ఉంది. దీంతో బావిలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన కొందరు యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో బావి కొంతవరకు ధ్వంసమైంది. పట్టించుకుంటే మంచి వనరు.. రాజా బావిలోని నీటిని గతంలో గ్రామ ప్రజలతో పాటు, పరిసర ప్రాంతాల ప్రజలు కూడా తాగేందుకు ఉపయోగించేవారు. ప్రస్తుతం బావి చుట్టూ ముళ్ల పొదలు పెరిగిపోవడంతోపాటు పూడికతో నిండిపోయి శిథిలావస్థకు చేరుకుంది. ఈ బావిలో నీళ్లు సాధారణంగా అయిపోవని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకప్పుడు ఎన్నో గ్రామాలకు తాగునీటిని అందించిన ఈ బావికి అధికారులు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ బావిని అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బావిని మంచినీటి వనరుగా చేసేకుంటే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదు. ఆ దిశగా పాలకులు, అధికారులు ఆలోచించాలి. -
మృత్యుంజయుడు!
నర్సాపూర్‌రూరల్ : పాడుబడిన బావిలో ఓ నవజాత మగ శిశువు లభ్యమైంది. కాగజ్‌మద్దూరు గ్రామంలో ఆదివారం పాడుబడిన బావి నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో అటుగా వెళ్తున్న గ్రామస్తులు తొంగి చూశా రు. పాడుబడిన బావిలో గాజుపెంకులు, చెత్తాచెదారం మధ్యలో శిశువు కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు..8 మీట ర్ల లోతులో ఉన్న శిశువును క్షేమంగా పైకి తీసుకొచ్చి నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. కాలుకు చిన్న గాయం తప్ప ఎలాంటి ప్రాణాపాయం లేదని నిర్ధారించారు. పుట్టిన మరుక్షణమే శిశువును బావిలో పడివేసి ఉంటారని వైద్యు లు భావిస్తున్నారు. సోమవారం సంగారెడ్డి లోని చైల్డ్వెల్ఫేర్ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ వెంకటరాజాగౌడ్ చెప్పారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన కాంగ్రెస్ నేత సునీతారెడ్డి.. శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శిశువుకు ‘మృత్యుం జయుడు’అనే పేరు పెట్టించాలన్నారు. -
కలెక్టరేట్లో నిజాం కాలం బావి
♦ చెక్కు చెదరని రాతి కట్టడం ♦ ఇంతకాలం చెత్తకుప్పగా వాడిన వైనం ♦ కలెక్టర్ చొరవతో పాత బావికి కొత్తరూపు హన్మకొండ అర్బన్: ఈ మధ్యకాలంలో కలెక్టరేట్‌లోకి వచ్చిన వారికి అక్కడో బావి ఉందని తెలియదు. బావి మొత్తం మట్టి, చెత్తా చెదారంతో నిండిపోయింది. పిచ్చి మొక్కలు పెరిగి ఆనవాళ్లు లేకుండా పోయింది. వాస్తవానికి అక్కడ నిజాం పాలన కాలంలో తవ్వించిన పెద్ద బావి ఉంది. ప్రస్తుతం అర్బన్ కలెక్టరేట్లో సమావేశ మందిరం పక్కన ఉంది. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ భవనానికి 1856లో శంకుస్థాపన జరిగినట్లు డీఆర్వో కార్యాలయం భవనానికి ఉన్న శిలాఫలకం ద్వారా తెలుస్తోంది. అయితో అప్పట్లో తవ్వించిన ఈ బావిని తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించారట. ప్రస్తుతం కలెక్టరేట్, క్యాంపు కార్యాలయం మొత్తం సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ రోజుల్లో స్థలం విస్తీర్ణం ఇంకా ఎక్కువ ఉండి చుట్టూ సాగు చేసేవారట. అప్పట్లో ఈ బావి నీరే ప్రధాన ఆధారంగా పనులు సాగేవి. కాలక్రమంలో పాలకులు, అధికారులు మారుతూ వస్తుండటం.. బోర్లు, నల్లాలు అందుబాటులోకి రావడంతో ఈ భావి అవసరాలు తగ్గాయి. దాదాపు 2008 బావికి బోరు బిగించి ఉండేది. తరువాత పూర్తిగా వదిలేశారు. కలెక్టరేట్ మధ్యలో వినియోగంలో లేని భావి ఉన్నందున దానిని పూడ్చివేయాలని అధికారులు భావించారు. దీంతో చెత్త, పాత భవనాల మట్టి తెచ్చి బావిని దాదాపు నింపేశారు. చెక్కుచెదరని రాతి కట్టడం కలెక్టరేట్లో ప్రస్తుతం పునరుద్ధరిస్తున్న నిజా కాలం నాటి రాతి కట్టడంతో ఉన్న బావి నిర్మాణం ఎంతో పటిష్టంగా ఉంది. వారం రోజులుగా మట్టి తొలగింపు పనులు జరగుతున్నాయి. 10 మీటర్లకు పైగా రాతి కట్టడం పూర్తిగా బయట పడింది. అయితే నిర్మాణంలో ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బందులు కూడా లేవు. ఒక్కరాయి కూడా ఇప్పటివరకు కదల్లేదు. కలెక్టర్ చొరవతో.. జిల్లా మొత్తంలో చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, మరమ్మతు, రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్న సమయంలో నిజాంకాలం నాటి బావి విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అమ్రపాలి ఒకసారి పరిశీలించారు. రాతి, నిర్మాణం పటిష్టంగా ఉందని అధికారులు చెప్పడంతో బావి పునరుద్ధరణ పనులు ఆర్‌డబ్ల్యూస్ అధికారులకు అప్పగించారు. నీరు వచ్చేవరకు మట్టి తీయడంతో పాటు చుట్టూ కంచె ఏర్పాటు చేసి సందర్శకుల కోసం ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం క్యాంపు కార్యాలయం మొత్తం పచ్చని వనం తయారు చేశారు. దానికి నీటి అవసరాలు ఈ బావి నుంచే తీర్చాలని భావిస్తున్నారు. ఈ రోజుల్లో కట్టడం సాధ్యం కాదు...- మల్లేశం, ఆర్‌డబ్ల్యూస్ ఇంజనీర్ కలెక్టరేట్లో ఉన్న బావి నిర్మాణం చాలా పటిష్టంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో అలాంటి బావి కట్టడం సాధ్యం కాదు. కలెక్టర్ చొరవతో పనులు మొదలు పెట్టాం. పూడికతీత పనులు సాగుతున్నాయి. అవరాన్ని బట్టి మరింత లోతు తీయడానికి ప్రయత్నిస్తాం. బావి నీరు వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. నీటి వినియోగంతోపాటు చారిత్రక కట్టడాన్ని కాపాడినట్లు అవుతుందని భావిస్తున్నాం.