బావిని చూస్తున్న గ్రామస్తులు
అద్భుత కట్టడాలకు ఆలవాలం కాకతీయుల కాలం.. వారి శిల్పకళ ప్రతిభ అనిర్వచనీయం.. నిర్మించి శతాబ్దాలు దాటినా చెక్కుచెదరని నైపుణ్యం వారి సొంతం.. ఆ కోవలోకే వస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఉన్న కాకతీయులు నిర్మించిన రాజా బావి.. 14వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడి పాలనలో ఇక్కడి సామంతరాజులు నిర్మించిన ఆ బావి ఇంకా పదిలంగానే ఉంది. కానీ నేటి పాలకులు, అధికారులు పట్టించుకోక పోవడంతో చారిత్రక కట్టడం నిరాదరణకు గురవుతోంది.
జూలూరుపాడు, భద్రాద్రి జిల్లా : శత్రుదేశాల సైన్యాల నుంచి రక్షించుకోవడానికి నాటి సామంతరాజులు ఒక రహస్య స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. అప్పట్లో దట్టమైన అడవి ఉన్న జూలూరుపాడును అనువైన ప్రాంతాంగా ఎంచుకున్నారు. అక్కడ నీటి అవసరాలకోసం సువిశాలమైన అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో రాతి కట్టడంతో రాజా బావిని నిర్మించారు. రాజా బావి పైభాగాన చుట్టూ 10గదులను నిర్మించారు. బావిలోకి మెట్లు 30 అడుగుల లోతు వరకు ఉంటాయి.
ఈ బావికి చుట్టూ ఉన్న గదుల పై కప్పు 8 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ఒకే రాయి ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్నేళ్లు పూడిక తీయకపోవడంతో బావి లోతు ఎంత అనేది ఎవరికీ తెలియదు. ఆ రోజుల్లో ఈ బావిని డంగు సున్నం, రాళ్లతో కట్టడంతో నేటికీ ధృడంగా ఉంది.
వరంగల్ వరకు సొరంగం..!
సాధారణంగా రాజులు తమ రహస్య స్థావరాలకు సొరంగ మార్గాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగానే ఈ బావికి కూడా సొరంగ మార్గం ఇటు వరంగల్ కోట వరకు.. అటు ఖమ్మం ఖిల్లా వరకు ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాకతీయ రాజులు వజ్ర వైఢూర్యాలు, బంగారు అభరణాలను ఈ బావిలో ఉంచారని స్థానికంగా ప్రచారంలో ఉంది. దీంతో బావిలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన కొందరు యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో బావి కొంతవరకు ధ్వంసమైంది.
పట్టించుకుంటే మంచి వనరు..
రాజా బావిలోని నీటిని గతంలో గ్రామ ప్రజలతో పాటు, పరిసర ప్రాంతాల ప్రజలు కూడా తాగేందుకు ఉపయోగించేవారు. ప్రస్తుతం బావి చుట్టూ ముళ్ల పొదలు పెరిగిపోవడంతోపాటు పూడికతో నిండిపోయి శిథిలావస్థకు చేరుకుంది. ఈ బావిలో నీళ్లు సాధారణంగా అయిపోవని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకప్పుడు ఎన్నో గ్రామాలకు తాగునీటిని అందించిన ఈ బావికి అధికారులు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ బావిని అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బావిని మంచినీటి వనరుగా చేసేకుంటే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదు. ఆ దిశగా పాలకులు, అధికారులు ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment