కుషినగర్: వివాహ వేడుక ఏకంగా 13 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా గ్రామంలో ఈ విషాద ఘటన బుధవారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పరమేశ్వర్ కుష్వాహా ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. ఆయన కుమారుడి పెళ్లిలో భాగంగా స్థానికంగా ‘మట్‌కోర్బా’ అనే శుభకార్యం నిర్వహిస్తారు. కుష్వాహా ఇంటికి 100 మీటర్ల సమీపంలోని ఒక పాడుబడ్డ బావి దగ్గర ఈ వేడుక కొనసాగుతోంది. ఆ వేడుక చూసేందుకు జనం గుమిగూడారు. మూసేసి ఉన్న ఒక బావి పై మహిళలు, చిన్నారులు కూర్చుని వేడుక చూస్తున్నారు.
70 ఏళ్ల క్రితంనాటి వినియోగంలో లేని పాత బావిపై దాదాపు పదేళ్ల క్రితం వేసిన స్లాబ్ పాడైంది. సామర్థ్యానికి మించి దానిపై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కూలింది. దీంతో 23 మంది బావిలో పడిపోయారు. హుటాహుటిన అక్కడి వారు లోపలి వారందరినీ పైకి తేగలిగారు. వారికి ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. 10 మంది గాయపడ్డారు. ఈ గ్రామాన్ని ఎంపీ విజయ్ దుబే గతంలో దత్తత తీసుకున్నారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని జిల్లా మేజిస్ట్రేట్ రాజలింగం చెప్పారు. ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment