kushinagar district
-
తల్లి, ఐదుగురు చిన్నారులు సజీవదహనం
కుషినగర్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలో బుధవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటికి నిప్పంటుకుని ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, అయిదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులంతా 1–10 ఏళ్లలోపు వారే. ఉర్ధా గ్రామానికి చెందిన సంగీత, ఆమె అయిదుగురు పిల్లలు ఇంట్లో పడుకోగా, ఆమె భర్త, అతడి తల్లిదండ్రులు ఆరు బయట నిద్రించారు. గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకోవడంతో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలింది. సంగీత భర్త వారిని కాపాడేందుకు ప్రయత్నించినా మంటల తీవ్రత కారణంగా వీలు కాలేదు.సంగీతతోపాటు ఏడాది నుంచి 10 ఏళ్ల వరకు వయస్సున్న చిన్నారులు మంటలకు ఆహుతయ్యారు. ఫైరింజన్ వచ్చే సరికే ఈ ఘోరం జరిగిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
పెళ్లి వేడుకలో అపశ్రుతి
కుషినగర్: వివాహ వేడుక ఏకంగా 13 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా గ్రామంలో ఈ విషాద ఘటన బుధవారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పరమేశ్వర్ కుష్వాహా ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. ఆయన కుమారుడి పెళ్లిలో భాగంగా స్థానికంగా ‘మట్‌కోర్బా’ అనే శుభకార్యం నిర్వహిస్తారు. కుష్వాహా ఇంటికి 100 మీటర్ల సమీపంలోని ఒక పాడుబడ్డ బావి దగ్గర ఈ వేడుక కొనసాగుతోంది. ఆ వేడుక చూసేందుకు జనం గుమిగూడారు. మూసేసి ఉన్న ఒక బావి పై మహిళలు, చిన్నారులు కూర్చుని వేడుక చూస్తున్నారు. 70 ఏళ్ల క్రితంనాటి వినియోగంలో లేని పాత బావిపై దాదాపు పదేళ్ల క్రితం వేసిన స్లాబ్ పాడైంది. సామర్థ్యానికి మించి దానిపై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కూలింది. దీంతో 23 మంది బావిలో పడిపోయారు. హుటాహుటిన అక్కడి వారు లోపలి వారందరినీ పైకి తేగలిగారు. వారికి ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. 10 మంది గాయపడ్డారు. ఈ గ్రామాన్ని ఎంపీ విజయ్ దుబే గతంలో దత్తత తీసుకున్నారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని జిల్లా మేజిస్ట్రేట్ రాజలింగం చెప్పారు. ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. -
సంతోషంగా ఉంది: ట్రాన్స్జెండర్లు
లక్నో: దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ రూపుదిద్దుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. అఖిల భారతీయ కిన్నర్ శిక్షా సేవా ట్రస్టు(ఏఐటీఈఎస్‌టీ) ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో శిశు తరగతి నుంచి పీహెచ్డీ వరకు అన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ విషయం గురించి ఏఐటీఈఎస్‌టీ అధ్యక్షుడు డాక్టర్ క్రిష్ణమోహన్ మిశ్రా మాట్లాడుతూ... ‘ ట్రాన్స్‌జెండర్ వర్గం కోసం దేశంలోనే తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. జనవరి 15 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయి. మా కమ్యూనిటీ నుంచి తొలుత ఇద్దరు పిల్లలకు ఇక్కడ ప్రవేశం కల్పిస్తాం. ఫిబ్రవరి, మార్చి నుంచి అన్ని తరగతులు ప్రారంభమవుతాయి’ అని పేర్కొన్నారు. ఇక ఈ యూనివర్సిటీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గంగా సింగ్ కుశ్వాహ... విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుని.. ట్రాన్స్జెండర్లు దేశానికి దిశా నిర్దేశం స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అదే విధంగా గుడ్డీ కిన్నర్ అనే ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ... ‘చాలా సంతోషంగా ఉంది. చదువుకుంటే మాకు ఈ సమాజంలో గౌరవం దక్కుతుంది. అందరిలాగే మేము కూడా తలెత్తుకుని బతకగలుగుతాం’ అని హర్షం వ్యక్తం చేశారు. -
యూపీ మసీదు పేలుడు కేసులో సిటీ డాక్టర్
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ కుషినగర్ జిల్లాలోని తుర్కుపట్టి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బైరాగిపట్టి మసీదు బాంబు పేలుడు కేసులో హైదరాబాద్‌లో ఉంటున్న ఆర్మీ మాజీ వైద్యుడు అష్వఖ్ ఆలం అరెస్టయ్యాడు. టోలిచౌకిలో గురువారం ఇతడిని అదుపులోకి తీసుకున్న ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ప్రత్యేక బృందం విచారణ అనంతరం శనివారం అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పేలుడు పదార్థాల సమీకరణకు సూత్రధారిగా ఉన్న హాజీ ఖుద్భుద్దీన్కు అష్వఖ్ మనుమడు అవుతాడు. బుధవారం ఖుద్భుద్దీన్ చిక్కగా.. విచారణలో అష్వఖ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆర్మీలో వీఆర్ఎస్.. సివిల్స్‌కు ప్రిపరేషన్ ఆర్మీ మెడికల్ కార్ప్‌లో (ఏఎంసీ) కెప్టెన్ హోదాలో అష్వఖ్ ఆలం, ఆయన భార్య ఎస్జే ఆలం పని చేశారు. హైదరాబాద్‌లో పని చేస్తుండగా 2017లో అష్వఖ్ వీఆర్ఎస్ తీసుకోగా.. ఎస్జే ఆలం హైదరాబాద్‌లోని ఆర్మీ వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. అష్వఖ్ ప్రస్తుతం సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడు. వీరి పూర్వీకులకు బైరాగిపట్టిలో ఆస్తులుండటంతో తరచూ అక్కడకు వెళ్లి వస్తుంటాడు. ఓ స్నేహితుడి వివాహానికి హాజరుకావడానికి ఈ నెల 8న అక్కడకు చేరుకున్న అష్వఖ్ 10న ఫంక్షన్‌కు హాజరయ్యాడు. ఆ మరుసటి రోజే (నవంబర్ 11న) బైరాగిపట్టిలోని మసీదులో పేలుడు జరిగింది. తక్కువ తీవ్రత కలిగిన దీని ప్రభావంతో అష్వఖ్ తాత ఖుద్భుద్దీన్ స్వల్పంగా గాయపడ్డాడు. ఆ గాయాలతోనే అక్కడ నుంచి పరారయ్యాడు. బ్యాటరీ పేలిందంటూ పక్కదారి.. పేలుడు జరిగిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన అష్వఖ్ ఆలం మసీదులో ఉన్న ఇన్వర్టర్ బ్యాటరీ పేలిందని, అందుకే శబ్ధం, పొగ వచ్చాయని చెప్పి కేసును తప్పుదోవ పట్టించాలని చూశాడు. ఘటనాస్థలికి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు బ్యాటరీ కాదని, పేలుడు పదార్థాల కారణంగానే విధ్వంసం చోటుచేసుకుందని తేల్చారు. దీంతో తుర్కుపట్టి పోలీసుస్టేషన్ నమోదైన ఈ కేసు దర్యాప్తు కోసం ఏటీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. ఓ పక్క ఖుద్భుద్దీన్ కోసం గాలిస్తూనే అష్వఖ్‌ను ప్రాథమికంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏటీఎస్ అధికారులు గోరఖ్‌పూర్‌లో ఖుద్భుద్దీన్‌ను అరెస్టు చేశారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే అష్వఖ్‌కు ఈ కుట్రలో ప్రమేయం ఉందని బయటపెట్టాడు. అనుకోకుండా జరిగిన ఈ పేలుడు తర్వాత అక్కడ సాక్ష్యాధారాలను అతడే నాశనం చేశాడని చెప్పాడు. ఏటీఎస్ టీమ్ విమానంలో హైదరాబాద్‌కి వచ్చి గురువారం రాష్ట్ర పోలీసుల సాయంతో అష్వఖ్‌ను అదుపులోకి తీసుకుని అక్కడకు తరలించింది. వివిధ కోణాల్లో ప్రశ్నించిన నేపథ్యంలో శనివారం అరెస్టు చేసి ఖుద్భుద్దీన్తో సహా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. ఆ ప్రార్థనా స్థలమే కారణం.. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురి విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఏటీఎస్ అధికారులు చెబు తున్నారు. ఖుద్భుద్దీన్ బైరాగిపట్టిలో ఉన్న ఓ ప్రార్థనా స్థలాన్ని టార్గెట్ చేశాడని చెబుతున్నారు. వీరి పూర్వీకులు దానం చేసిన భూమిలో అది కొనసాగుతోందని.. దీనిపైనే వివాదం తలెత్తిందని ఏటీఎస్ చెబుతోంది. టార్గెట్ చేసిన స్థలంలో భారీ విధ్వంసాల కోసం దాచి ఉంచిన ఈ పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలాయని దర్యాప్తులో తేల్చారు. పేలుడు తర్వాత గోరఖ్‌పూర్‌కు పారిపోయిన ఖుద్భుద్దీన్‌ను కలి సేందుకు అష్వఖ్ ఆలం విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈలోపే ఇద్దరూ తమకు చిక్కారని చెబుతున్నారు. వీరిద్దరినీ తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరు తూ ఏటీఎస్ అధికారులు అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అష్వఖ్తోపాటు అతడి భార్య సైతం ఆర్మీ డాక్టర్లు కావడంతో మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ విభాగాలకు చెందిన ప్రత్యేక బృందాలు అష్వఖ్తో పాటు అతడి భార్యను ప్రశ్నించాలని నిర్ణయించాయి. -
యూపీ ఏటీఎస్ అదుపులో సిటీ డాక్టర్
సాక్షి, హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగిపట్టిలో ఉన్న మసీదులో జరిగిన బాంబు పేలుడు కేసులో హైదరాబాద్‌లో ఉంటున్న ఓ ఆర్మీ మాజీ వైద్యుడు అను మానితుడిగా మారాడు. తన భార్యతో కలసి టోలి చౌకిలో నివసిస్తున్న అష్వఖ్‌ను యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ప్రత్యేక బృందం గురు వారం నగరంలో అదుపులోకి తీసుకుంది. తదు పరి విచారణ నిమిత్తం అక్కడకు తరలించింది. సోమవారం జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇప్పటికే అష్వఖ్ బంధువు అరెస్టు అయ్యాడు. వివాహానికి వెళ్లి.. అష్వఖ్ సమీప బంధువైన హాజీ ఖుద్భుద్దీఉత్తన్ బైరాగిపట్టిలోని ఓ మసీదులో పని చేస్తున్నాడు. ఓ స్నేహితుడి వివాహానికి హాజరుకావడానికి అష్వఖ్ ఈ నెల 8న బైరాగిపట్టికి చేరుకున్నాడు. పదో తేదీన ఫంక్షన్ పూర్తి చేసుకుని 12న తిరిగి హైదరాబాద్ రావడానికి రిజర్వేషన్ చేయించుకున్నాడు. ఈ క్రమంలో బైరాగిపట్టి మసీదు సమీపంలోని ఖుద్భుద్దీన్ నివాసానికి అష్వఖ్ వెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం ఈ మసీదులో చిన్నస్థాయి పేలుడు సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినప్పటికీ మసీదు తలుపులు, కిటికీలు ధ్వంస మయ్యాయి. దీనికి సంబంధించి ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేపట్టిన కుషినగర్ పోలీసులు సదరు మసీదులో ఇమామ్‌గా పనిచేస్తున్న మౌలానా అజ్ముద్దీన్, ఖుద్భుద్దీన్ సహా మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. దర్యాప్తు చేపట్టిన ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అధికారులు పేలుడు జరిగిన రెండ్రోజుల్లోనే అజ్ముద్దీన్‌తోపాటు ఇజార్, జావేద్‌లను నిందితులుగా పేర్కొంటూ అదుపులో కి తీసుకున్నారు. అజ్ముద్దీన్ పాత్రపై ఆధారాలు లేక పోవడంతో అతడిని విడిచిపెట్టి, ఇజార్, జావేద్ సహా నలుగురిని అరెస్టు చేశారు. అనుమానితుడే.. ఖుద్భుద్దీన్ ఇచ్చిన సమాచారంతో గోరఖ్‌పూర్ ఏటీఎస్ పోలీసులు, అక్కడి లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంయుక్త బృందం అష్వఖ్ కోసం రంగంలోకి దిగింది. హుటాహుటిన విమానంలో నగరానికి వచ్చిన బృందం మెహిదీపట్నంలో అష్వ ఖ్‌ను అదుపులోకి తీసుకుని గురువారమే అక్కడకు తరలించింది. ఈ కేసులో అష్వఖ్ అనుమానితుడు మాత్రమే అని, వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నామని యూపీ పోలీసులు చెబుతున్నారు. అష్వఖ్ బంధువులు మాత్రం పోలీసుల ఆరోపణలను ఖండిస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే అతడే స్థానిక ఎస్పీకి ఫోన్ చేసి విషయం చెప్పాడని తెలిపారు. ముందుగా రిజర్వేషన్ చేయించుకున్న నేపథ్యంలో కుషినగర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వా తే అతడు హైదరాబాద్ వచ్చాడని స్పష్టం చేస్తున్నా రు. అష్వఖ్ కెప్టెన్ హోదాలో ఆర్మీలో డాక్టర్‌గా పనిచేసి ఉండటం, ప్రస్తుతం అతడి భార్య ఆ విభాగంలోనే పనిచేస్తుండటంతో మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరీ అష్వఖ్.. ఉత్తరప్రదేశ్ బైరాగిపట్టికి చెందిన అష్వఖ్ అక్కడి అలీఘర్ వర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. కెప్టెన్ హోదాలో ఇండియన్ ఆర్మీలో చేరి కొన్నేళ్ల పాటు సేవలు అందించాడు. రెండేళ్ల క్రితం వీఆర్ఎస్ తీసుకున్న అష్వఖ్ అక్కడ పనిచేస్తుండగానే జగిత్యాలకు చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
యూపీలో కుప్పకూలిన యుద్ధవిమానం
లక్నో : భారత వాయుసేనకు చెందిన జాగ్వర్ యుద్ధ విమానం సోమవారం యూపీలోని ఖుషీనగర్ జిల్లాలో కుప్పకూలింది. గోరఖ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన విమానం హెతింపిర్ ప్రాంతం వద్ద కూలిపోయింది. విమాన ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా గత ఏడాది జూన్‌లో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో జాగ్వర్ యుద్ధ విమానం కూలిన ఘటనలో విమానం నడుపుతున్న సీనియర్ అధికారి మరణించారు. బరేజా గ్రామంలో విమానం కుప్పకూలడంతో పైలట్‌గా ఉన్న వాయుసేన పతక గ్రహీత, జామ్‌నగర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఎయిర్‌ఆఫీసర్ కమాండింగ్ సంజయ్ చౌహాన్ మరణించారు. -
‘బడికి కాదు.. కాటికి సాగనంపా’
లక్నో, కుశినగర్ : ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం తాలూకు బాధిత కుటుంబాల్లో శోకం అలుముకుంది. స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టిన ఘటనలో 13 మంది విద్యార్థులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మిశ్రౌలీ గ్రామ పెద్ద కిరణ్‌దేవి తన ముగ్గురు బిడ్డల్ని కోల్పోయారు. ఘటనలో రవి (12), సంతోష్ (10), రాగిణి (7)లు విగతజీవులుగా మారారు. ‘బడికి వెళ్లమని నా పిల్లలు మొండికేశారు. కానీ బలవంతంగా వారిని బస్సు ఎక్కించి నా చేతులారా నేనే చంపుకున్నా’అని కిరణ్ దేవి గుండెలవిసేలా రోదించారు. కాగా, ఈ ఘటనతో షాక్‌కు గురైన చిన్నారుల తండ్రి ఇంకా తేరుకోలేదు. ‘మా మనుమలు, మనమరాలు ఫోటోలు గోడకు వేలాడుతున్నాయి. కానీ వారు లేరనే విషయాన్ని నమ్మలేక పోతున్నాం. ఆ ఫోటోలపైపు చూడాలంటేనే భయంగా ఉంది’ అని చిన్నారుల తాతయ్య హరిహర ప్రసాద్ భోరున విలపించాడు. తన కొడుకు పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడని.. ఇప్పుడు తమ వంశానికి వారసులే లేకుండా పోయారని వాపోయాడు. కుశినగర్ జిల్లాలో కాపలా లేని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద గురువారం ఈ ఘోర ప్రమాదం సంభవించింది. రైలు ఢీకొట్టడంతో 13 మంది విద్యార్థులు మృతి చెందారు. మృతులంతా 12 ఏళ్లలోపు వాళ్లే. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా నలుగుగు విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం యోగి ఆదిత్యానాథ్.. ప్రభుత్వం తరపున రూ. 2లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. -
యోగి ఆదిత్యనాథ్ అనుచిత ఆగ్రహం
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో గురువారం నాడు కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద ఓ రైలు, ఓ స్కూల్ వ్యాన్ ఢీకొన్న సంఘటనలో 13 మంది విద్యార్థులు మరణించిన విషయం తెల్సిందే. ఈ దుర్ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నినాదాలు ఆపండి, ఇది విషాధకర సంఘటన. మీ నాటకాలు కట్టి పెట్టండి. నా మాటలు ఆలకించి మీ నాటకాలు ఆపండి!’ అంటూ ఆదిథ్యనాథ్ ఆవేశంగా మాట్లాడారు. జరిగిన దుర్ఘటన పట్ల సానుభూతి వ్యక్తం చేయడమే కాకుండా వారి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం, చేయూత అందించాల్సిన ముఖ్యమంత్రి ఇలా ‘మీ నాటకాలు ఆపండి’ అంటూ మాట్లాడం పట్ట బాధితుల తల్లిదండ్రులే కాకుండా ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతులంతా డివైన్ స్కూల్‌కు చెందిన పిల్లలే. అందరూ పదేళ్లలోపు వారే. యోగికి సంబంధించిన ఈ వివాదాస్పద వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
డ్రైవర్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడం వల్లే...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కుశి నగర్లో పాఠశాల వ్యాన్ రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుని 13 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. వ్యాన్ డ్రైవర్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. గురువారం ఆయన సంఘటన స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను ఓదార్చారు. అనంతరం సీఎం యోగీ మీడియాతో మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతున్నాడని, అతడి చెవిలో ఇయర్‌ఫోన్స్ కూడా ఉన్నాయని తెలిపారు. అందువల్లే, క్రాసింగ్ వద్ద సెక్యూరిటీ గార్డు సంకేతాలిస్తున్నా డ్రైవర్‌కి వినిపించలేదని వివరించారు. డ్రైవర్... పాఠశాల నుంచే ఫోన్ మాట్లాడుతూ వ్యాన్ నడుపుకుంటూ వచ్చాడని, అయినప్పటికీ సదరు పాఠశాల యాజమాన్యం అతడిని ఎందుకు ప్రశ్నించలేదన్న విషయంపై తాము విచారణ చేపడతామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి పియూష్ గోయల్‌తో కూడా చర్చించినట్లు సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కాగా మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ కూడా రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయలైనవారికి బీఆర్డీ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. చదవండి...ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం -
యూపీలో ఘోర రైలు ప్రమాదం
-
ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ వేకువ ఝామున స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఓ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది చిన్నారులతోపాటు డ్రైవర్ కూడా దుర్మరణం పాలయ్యారు. కుశినగర్ జిల్లాలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డివైన్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన వ్యాన్ పిల్లలను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద దాటుతుండగా.. వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఈ నెలలో ఇది రెండో ఘటన. ఏప్రిల్ 10వ తేదీన హిమాచల్ ప్రదేశ్ కంగారాలో ఓ స్కూల్ బస్సు లోయలో పడి 27 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
తమను కాదని పరీక్ష రాసిందని...
లక్నో: తమను కాదని పరీక్ష రాసిందన్న అక్కసుతో దళిత బాలిక(17)పై కిరోసిన్ పోసి నిప్పంటించారో నలుగురు దుర్మార్గులు. ఉత్తరప్రదేశ్ లోని ఖుషీనగర్ జిల్లా పత్తార్ దెవా గ్రామంలో గురువారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షలకు బాధితురాలు హాజరయిందన్న కోపంతో నిందితులు ధిరజ్ యాదవ్, అతడి సోదరులు అర్వింద్, దినేష్ వారి తండ్రి రాంపర్వేష్ యాదవ్ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇంట్లో వంట చేస్తున్న బాలికను బయటకు ఈడ్చుకొచ్చి కిరోసిన్ పోసి నిప్పంటించారని చెప్పారు. 70 శాతం కాలిన గాయాలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాను చదువుకొనసాగించడం నిందితులకు ఇష్టం లేదని బాధితురాలు తెలిపింది. స్కూల్ లో ప్రతీ పరీక్షలో వారు ఫెయిలయ్యారని అందుకే తన చదువుకు అడ్డుకోవాలని చూశారని చెప్పింది. కొన్ని నెలల క్రితం ధిరజ్ తన ఫోటో తీసి బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడని, ఈ సందర్భంగా తమ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగిందని వెల్లడించింది. ధిరజ్ తనపైనా కూడా దాడి చేశాడని బాధితురాలి సోదరుడు తెలిపాడు.