సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ కుషినగర్ జిల్లాలోని తుర్కుపట్టి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బైరాగిపట్టి మసీదు బాంబు పేలుడు కేసులో హైదరాబాద్‌లో ఉంటున్న ఆర్మీ మాజీ వైద్యుడు అష్వఖ్ ఆలం అరెస్టయ్యాడు. టోలిచౌకిలో గురువారం ఇతడిని అదుపులోకి తీసుకున్న ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ప్రత్యేక బృందం విచారణ అనంతరం శనివారం అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పేలుడు పదార్థాల సమీకరణకు సూత్రధారిగా ఉన్న హాజీ ఖుద్భుద్దీన్‌కు అష్వఖ్ మనుమడు అవుతాడు. బుధవారం ఖుద్భుద్దీన్ చిక్కగా.. విచారణలో అష్వఖ్ పేరు వెలుగులోకి వచ్చింది.
ఆర్మీలో వీఆర్‌ఎస్.. సివిల్స్‌కు ప్రిపరేషన్
ఆర్మీ మెడికల్ కార్ప్‌లో (ఏఎంసీ) కెప్టెన్ హోదాలో అష్వఖ్ ఆలం, ఆయన భార్య ఎస్‌జే ఆలం పని చేశారు. హైదరాబాద్‌లో పని చేస్తుండగా 2017లో అష్వఖ్ వీఆర్‌ఎస్ తీసుకోగా.. ఎస్‌జే ఆలం హైదరాబాద్‌లోని ఆర్మీ వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. అష్వఖ్ ప్రస్తుతం సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడు. వీరి పూర్వీకులకు బైరాగిపట్టిలో ఆస్తులుండటంతో తరచూ అక్కడకు వెళ్లి వస్తుంటాడు. ఓ స్నేహితుడి వివాహానికి హాజరుకావడానికి ఈ నెల 8న అక్కడకు చేరుకున్న అష్వఖ్ 10న ఫంక్షన్‌కు హాజరయ్యాడు. ఆ మరుసటి రోజే (నవంబర్ 11న) బైరాగిపట్టిలోని మసీదులో పేలుడు జరిగింది. తక్కువ తీవ్రత కలిగిన దీని ప్రభావంతో అష్వఖ్ తాత ఖుద్భుద్దీన్ స్వల్పంగా గాయపడ్డాడు. ఆ గాయాలతోనే అక్కడ నుంచి పరారయ్యాడు.
బ్యాటరీ పేలిందంటూ పక్కదారి..
పేలుడు జరిగిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన అష్వఖ్ ఆలం మసీదులో ఉన్న ఇన్వర్టర్ బ్యాటరీ పేలిందని, అందుకే శబ్ధం, పొగ వచ్చాయని చెప్పి కేసును తప్పుదోవ పట్టించాలని చూశాడు. ఘటనాస్థలికి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు బ్యాటరీ కాదని, పేలుడు పదార్థాల కారణంగానే విధ్వంసం చోటుచేసుకుందని తేల్చారు. దీంతో తుర్కుపట్టి పోలీసుస్టేషన్ నమోదైన ఈ కేసు దర్యాప్తు కోసం ఏటీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. ఓ పక్క ఖుద్భుద్దీన్ కోసం గాలిస్తూనే అష్వఖ్‌ను ప్రాథమికంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏటీఎస్ అధికారులు గోరఖ్‌పూర్‌లో ఖుద్భుద్దీన్‌ను అరెస్టు చేశారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే అష్వఖ్‌కు ఈ కుట్రలో ప్రమేయం ఉందని బయటపెట్టాడు. అనుకోకుండా జరిగిన ఈ పేలుడు తర్వాత అక్కడ సాక్ష్యాధారాలను అతడే నాశనం చేశాడని చెప్పాడు. ఏటీఎస్ టీమ్ విమానంలో హైదరాబాద్‌కి వచ్చి గురువారం రాష్ట్ర పోలీసుల సాయంతో అష్వఖ్‌ను అదుపులోకి తీసుకుని అక్కడకు తరలించింది. వివిధ కోణాల్లో ప్రశ్నించిన నేపథ్యంలో శనివారం అరెస్టు చేసి ఖుద్భుద్దీన్‌తో సహా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది.
ఆ ప్రార్థనా స్థలమే కారణం..
ఈ కేసులో అరెస్టయిన ఏడుగురి విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఏటీఎస్ అధికారులు చెబు తున్నారు. ఖుద్భుద్దీన్ బైరాగిపట్టిలో ఉన్న ఓ ప్రార్థనా స్థలాన్ని టార్గెట్ చేశాడని చెబుతున్నారు. వీరి పూర్వీకులు దానం చేసిన భూమిలో అది కొనసాగుతోందని.. దీనిపైనే వివాదం తలెత్తిందని ఏటీఎస్ చెబుతోంది. టార్గెట్ చేసిన స్థలంలో భారీ విధ్వంసాల కోసం దాచి ఉంచిన ఈ పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలాయని దర్యాప్తులో తేల్చారు. పేలుడు తర్వాత గోరఖ్‌పూర్‌కు పారిపోయిన ఖుద్భుద్దీన్‌ను కలి సేందుకు అష్వఖ్ ఆలం విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈలోపే ఇద్దరూ తమకు చిక్కారని చెబుతున్నారు. వీరిద్దరినీ తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరు తూ ఏటీఎస్ అధికారులు అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అష్వఖ్‌తోపాటు అతడి భార్య సైతం ఆర్మీ డాక్టర్లు కావడంతో మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ విభాగాలకు చెందిన ప్రత్యేక బృందాలు అష్వఖ్‌తో పాటు అతడి భార్యను ప్రశ్నించాలని నిర్ణయించాయి.
Comments
Please login to add a commentAdd a comment