డాక్టర్ వెంకన్న
సాక్షి, హైదరాబాద్: నగర యువతిని వివాహం చేసుకున్న వైద్యుడు పెళ్లయిన వారం రోజుల నుంచే వరకట్న వేధింపులు మొదలెట్టాడు. బాధితురాలు సీసీఎస్ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏపీలోని కాకినాడ సమీపంలో ఉన్న రాయుడుపాలెం రాజీవ్‌నగర్‌కు చెందిన ఆకుల వెంకన్నకు, నగరవాసి అయిన యువతికి గతేడాది జనవరి 7న వివాహమైంది.
ఆ సమయంలో రూ.25 లక్షలు కట్నంగా ఇవ్వడంతో పాటు రూ.50 లక్షలకు ఖర్చుతో ఘనంగా పెళ్లి చేశారు. అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు వారం రోజులకే వరకట్న వేధింపులు ఎదురయ్యాయి. వివాహ సమయంలో ఆమెకు పెట్టిన వాటితో పాటు ఒంటిపై ఉన్న నగలు తీసుకున్న అత్తింటి వాళ్లు పుట్టింటి నుంచి మరికొంత తీసుకురమ్మని వేధించారు. ఆమె తన బంధువుతో కలవకుండా దూరంగా బంధించారు. దీంతో చేసేదేమీ లేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
పెళ్లికి ముందే మరొక యువతితో సంబంధం ఉందని, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారని, అయితే డబ్బు కోసం తనను పెళ్లి చేసుకున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. తమ వద్ద నుంచి డబ్బు రాదని తెలుసుకుని మరో వివాహం చేసుకునేందకు సిద్ధమవుతున్నాడని ఆరోపించింది.
ఈ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు వెంకన్నతో పాటు అతని తల్లి చక్రవేణి, సోదరులు ఆకుల సూర్య వెంకటేశ్వరరావు, ఆకుల సీతారామయ్య, సోదరి నాగసీత, తండ్రి ఆకుల అర్జున్‌రావు, సమీప బంధువు వెంకట కుమార్ కొప్పిరెడ్డి, అతని సోదరి రావూరి పార్వతిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (Hyderabad: భవనం కాదండోయ్.. మరేంటో మీరు తెలుసుకోండి!)
Comments
Please login to add a commentAdd a comment