ప్రతీకాత్మక చిత్రం
లక్నో: దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ రూపుదిద్దుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. అఖిల భారతీయ కిన్నర్ శిక్షా సేవా ట్రస్టు(ఏఐటీఈఎస్‌టీ) ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో శిశు తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ విషయం గురించి ఏఐటీఈఎస్‌టీ అధ్యక్షుడు డాక్టర్ క్రిష్ణమోహన్ మిశ్రా మాట్లాడుతూ... ‘ ట్రాన్స్‌జెండర్ వర్గం కోసం దేశంలోనే తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. జనవరి 15 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయి. మా కమ్యూనిటీ నుంచి తొలుత ఇద్దరు పిల్లలకు ఇక్కడ ప్రవేశం కల్పిస్తాం. ఫిబ్రవరి, మార్చి నుంచి అన్ని తరగతులు ప్రారంభమవుతాయి’ అని పేర్కొన్నారు.
ఇక ఈ యూనివర్సిటీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గంగా సింగ్ కుశ్వాహ... విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుని.. ట్రాన్స్‌జెండర్లు దేశానికి దిశా నిర్దేశం స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అదే విధంగా గుడ్డీ కిన్నర్ అనే ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ... ‘చాలా సంతోషంగా ఉంది. చదువుకుంటే మాకు ఈ సమాజంలో గౌరవం దక్కుతుంది. అందరిలాగే మేము కూడా తలెత్తుకుని బతకగలుగుతాం’ అని హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment