పెంచిన బిడ్డే ప్రాణం తీసింది
పిఠాపురం : బిడ్డలు లేని ఆ తల్లి ఓ అనాథ ఆడపిల్లను దత్తత తీసుకుని పెంచింది. తన ఆలన పాలన చూస్తుందని ఆశించింది. పెంచి పెద్దచేసి ఓ అయ్య చేతిలో పెట్టింది. ఇన్నాళ్లూ తనను పెంచి పెద్దచేసి జీవితాన్ని ఇచ్చిన ఆ తల్లిని ఆస్తి కోసం భర్తతో కలిసి పీకనులిమి దారుణంగా అంతమొందించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సంచలనం సృష్టించింది.
ఈ నెల 17న లయన్స్‌క్లబ్ కల్యాణ మండపం సమీపంలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసు మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి పిఠాపురం సీఐ అప్పారావు పట్టణ పోలీసు స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
పిఠాపురం లయన్స్‌క్లబ్ కల్యాణ మండపం సమీపంలో వృద్ధురాలు కేతినీడి ఉమాదేవి (71) తన ఇంట్లో నివాసముంటోంది. భర్త లేని ఆమె అనాథ బలిక అయిన హేమమాలినిని దత్తత తీసుకుంది. పెంచి పెద్దచేసి పిఠాపురం మండలం మాధవపురానికి చెందిన ఆళ్ల నారాయణకు ఇచ్చి పెళ్లి చేసింది. నారాయణ ఖాళీగా తిరుగుతూ డబ్బుకోసం ఉమాదేవిపై ఒత్తిడి తెచ్చేవాడు. డబ్బు ఇవ్వడానికి ఆమె నిరాకరించడంతో నారాయణ తన భార్య హేమమాలినిని తీసుకుని గొల్లప్రోలులో వేరు కాపురం పెట్టాడు. వారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారన్న సంగతి తెలుసుకుని ఉమాదేవి వారిద్దరినీ తీసుకు వచ్చి తన ఇంట్లోనే పెట్టుకుంది. నారాయణ రెండు నెలల నుంచి ఉమాదేవికి చెందిన బంగారు వస్తువులు దొంగచాటుగా తీసి తాకట్టు పెట్టుకుని జల్సాలు చేసేవాడు. ఇది గమనించిన ఉమాదేవి తన వస్తువులు ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించింది. అయినా మారకపోవడంతో తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు.. వెళ్లి పోవాలని నారాయణను హెచ్చరించింది.
16వ తేదీన ఇంటికి వచ్చిన నారాయణను తన వస్తువులు రేపటి లోగా ఇచ్చి తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పింది. ఇంట్లోకి వెళ్లిన నారాయణ తన అత్తను ఎలాగైనా అంతమొందించాలని భార్యకు నూరిపోశాడు. అర్ధరాత్రి వంటింట్లో నిద్రిస్తున్న ఉమాదేవిని కాళ్లు చేతులు కదలకుండా హేమామాలిని పట్టుకోగా, భర్త నారాయణ పీక నులిమి తువ్వాలు మెడకు బిగించి చంపేశాడు. ఆ తర్వాత బాత్రూమ్‌లో జారిపడిపోయినట్టు అందరినీ నమ్మించారు. ఆటోలో స్థానిక ప్రైయివేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి సిబ్బంది ఆమె చనిపోయిందని చెప్పగా ఇంటికి తీసుకు వచ్చి దహన సంస్కారాలు చేసేందుకు ప్రయత్నించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉమాదేవి బంధువులకు సమాచారం ఇచ్చారు. కుమార్తె, అల్లుడు తన ఆస్తి కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఉమాదేవి గతంలోనే బంధువులకు చెప్పింది. అనుమానం వచ్చిన ఆమె బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సీఐ అప్పారావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై శోభన్‌ఉమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో మృతురాలి ఇంటికి వచ్చిన ఆమె బంధువులు హేమామాలినిని నిలదీయగా తన భర్త సహకారంతో తల్లిని హత్య చేసినట్టు ఒప్పుకుంది. సోమవారం రాత్రి పట్టణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు సీఐ సీఐ అప్పారావు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై శోభన్‌కుమార్, అదనపు ఎస్సై మూర్తి తదితరులు పాల్గొన్నారు.