క్రీడా ఆణిముత్యం సింధూ
-
నారాయణ మెడికల్ కళాశాలలో విజయోత్సవ వేడుక
నెల్లూరు రూరల్: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం అందించిన బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకటసింధూ క్రీడా ఆణిముత్యమని పలువురు ప్రముఖులు కొనియాడారు. చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల సెమినార్ హాల్లో విజయోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత క్రీడాకారిణి సింధూ సోదరి దివ్య కేక్‌ను కట్ చేశారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీరనాగిరెడ్డి మాట్లాడారు. వీరోచిత పోరాట ప్రతిభ కనబర్చిన సింధూ విద్యార్థులకు ఆదర్శమని చెప్పారు. నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఏజీఎం భాస్కర్‌రెడ్డి, ప్రముఖ డాక్టర్ కలికి హైమావతి, తదితరులు పాల్గొన్నారు.
సింధూకు తల్లిదండ్రులే స్ఫూర్తి
రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ మహిళల విభాగంలో రజత పతకం సాధించిన సింధూకు తల్లిదండ్రులే స్ఫూర్తి అని సోదరి దివ్య పేర్కొన్నారు. నారాయణ మెడికల్ కళాశాలలో ఎమ్మెస్ కోర్సును అభ్యసిస్తున్న దివ్య విజయోత్సవ వేడుకల్లో మాట్లాడారు. సింధూ ఆరో సంవత్సరం నుంచే తండ్రితో పాటు గ్రౌండ్స్‌కు వెళ్లేదని, అక్కడి నుంచే బాడ్మింటన్ ఆడేదని గుర్తు చేసుకున్నారు. సింధూ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారని చెప్పారు. కోచ్ గోపీచంద్ కృషితోనే ఈ స్థాయికి ఎదిగిందన్నారు. తన చెల్లెలు ఈ స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. నారాయణ మెడికల్ కళాశాలలో సింధూ విజయోత్సవ వేడుకలను నిర్వహించేందుకు మంత్రి నారాయణ, కళాశాల యాజమాన్యం సహకరించడం ఆనందంగా ఉందని తెలిపారు.