బ్యాంక్ ఖాతా తెరుస్తున్నారా.. అయితే ఒక్క నిమిషం..
బ్యాంక్ ఖాతా తెరుస్తున్నారా.. అయితే ఒక్క నిమిషం..
Published Mon, Dec 5 2016 4:01 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
పెద్ద నోట్ల రద్దుతో ఎన్నడూ బ్యాంక్ మెట్లు ఎక్కని వారందరూ నేడు వాటి చుట్టూ తిరగాల్సి వస్తోంది. కరెన్సీ కష్టాలకు చెక్ పెట్టాలంటే అందరినీ ఆన్‌లైన్ లావాదేవీలవైపు మళ్లించడమే అంతిమ మార్గమని ప్రభుత్వాలు తేల్చేశాయి. దీంతో భవిష్యత్‌లో నగదు రహిత లావాదేవీలే కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ లావాదేవీ చేసేందుకు ప్రతి వ్యక్తికి కచ్చితంగా ఏదైనా బ్యాంక్‌లో ఖాతా ఉండాలి. బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్, జాయింట్ వంటి ఖాతాలు అనేకం ఉన్నాయి. ఖాతా తెరిచే ముందు బ్యాంకులో అందుబాటులో ఉన్న ఖాతాలు, వాటి ఉపయోగాలు తెలుసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
విశాఖపట్నం : ప్రతి వ్యక్తి తన అవసరానికి తగినట్టు ఎన్ని బ్యాంకుల్లోనైనా ఖాతాలు ప్రారంభించవచ్చు.
కానీ ఆ ఖాతా నిర్వహణకు సంబంధించిన నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి.
సేవింగ్స్ ఖాతా ఇలా..
వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబం, స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే సేవింగ్‌స ఖాతా తెరిచేందుకు అనుమతి ఉంది. వ్యక్తిగతంగానూ లేక మరొకరి భాగస్వామ్యంతోనూ కలిసి ఈ సేవింగ్ ఖాతా తెరవచ్చు. దీనిని స్వయంగా నిర్వహించేందుకు, లేదా వారి తరఫున మరొకరు నిర్వహించేందుకు పవర్ ఆఫ్ అటార్సీ ఇవ్వడానికి కూడా అనుమతి ఉంది. కనీస నగదు నిల్వను అన్ని వేళలా ఉంచాలి. సేవింగ్ ఖాతాలో నిల్వ ఉన్న నగదు మొత్తానికి వివిధ బ్యాంకులు 4 నుంచి 6 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తున్నాయి. ఖాతాతో పాటు ఏటీఎం కమ్ డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, చెక్‌బుక్ సేవలు పొందవచ్చు. వీటితోపాటు ఆయా బ్యాంకులు వ్యక్తిగత బీమా, లాకర్ సదుపాయాలను అందిస్తున్నారుు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉచిత ఫోన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంటి ముంగిటకే బ్యాంకింగ్, కోరినన్ని చెక్కులు, ఉచిత డీడీలు తదితర సదుపాయాలు కల్పిస్తున్నారుు.
కరెంట్ ఖాతా
వ్యాపారస్తులు, రోజువారీ నగదు లావాదేవీలు నిర్వహించే వారికి కరెంట్ ఖాతాలు అనువుగా ఉంటాయి. నగదు డిపాజిట్, ఉపసంహరణ పరిమితి ఉండదు. ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయడంతో పాటు డ్రా చేసుకోవచ్చు. చెక్ బుక్‌ల విషయంలోనూ పరిమితి ఉండదు. రోజువారీ లావాదేవీలు, ఆయా ఖాతాదారుడి చరిత్ర ఆధారంగా బ్యాంకులు ఓడీ సౌకర్యం కల్పిస్తున్నారుు. కరెంట్ ఖతాలో నిల్వ ఉండే నగదుకు బ్యాంకులు వడ్డీ చెల్లించవు.
వేతన ఖాతాలు
వేతన ఖాతాలను ఎవరికి వారు వ్యక్తిగతంగా తీసుకునేందుకు వీలు లేదు. కంపెనీలు, సంస్థలే బ్యాంకులతో ఒప్పందం చేసుకుని తమ ఉద్యోగుల పేరిట ఖాతాలు తెరుస్తుంటాయి. ఈ ఖాతాల ద్వారా ఉద్యోగులకు పలు ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. వేతన ఖాతాల్లోనే ప్రీమియం, ప్రయారిటీ, శాలరీ, శాలరీ ప్లస్, ప్లాటినం ఇలా రకరకాల పేర్లుతో వివిధ అదనపు ప్రయోజనాలతో అందిస్తున్నాయి.
Advertisement
Advertisement