లారీ ఢీ కొని యువకుడి మృతి
లారీ ఢీ కొని యువకుడి మృతి
Published Thu, Feb 2 2017 11:53 PM | Last Updated on Thu, Mar 28 2019 6:31 PM
కానూరు (పెరవలి) : అతివేగంగా వచ్చిన లారీ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెరవలి ఎస్సై పి.నాగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిడదవోలు పట్టణానికి చెందిన బిరుదుకోట సత్యనారాయణ (30) పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి మోటార్‌సైకిల్‌పై వెళుతున్నారు. కానూరు సమీపంలోకి వచ్చే సరికి పెరవలి వైపు నుంచి నిడదవోలు వైపు వెళుతున్న క్వారీ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. మోటార్ సైకిల్‌పై నుంచి సత్యనారాయణ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థాని కులు 108కి సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి క్షతగాత్రుడిని తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు తీవ్రగాయం కావడంతో ఆసుపత్రిలో వైద్యం అందించే లోపే సత్యనారాయణ ప్రాణాలు కోల్పోయాడు. సత్యనారాయణ అవివాహితుడు. అతడి మృతివార్త విన్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు, పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్ ఢీకొని ...
ఏలూరు అర్బన్ : స్థానిక పాత బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు మండలం పోణంగి గ్రామానికి చెందిన షేక్ చినమెహబూబ్ అలియాస్ చినబాబు (30) నౌబత్ ఖానా వాద్యకారుడిగా జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పనులపై గురువారం ఏలూరు వచ్చిన అతడు పనులు ముగించుకుని పాత బస్టాండ్ సమీపంలో జీఎన్‌టీ రోడ్డును దాటే క్రమంలో గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్ వేగంగా ఢీ కొట్టింది. బస్ చినబాబు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. టూటౌన్ ఎస్సై అల్లు దుర్గారావు స్థానికులను విచారించారు. మృతుడి ఆచూకీ సేకరించి అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పంపించారు.
Advertisement
Advertisement