కృష్ణమ్మ వాకిట్లో.. పున్నమి పరవళ్లు
కృష్ణమ్మ వాకిట్లో.. పున్నమి పరవళ్లు
Published Thu, Aug 18 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
వారం రోజుల్లో 5.90 లక్షల భక్తులు
– సంగమేశ్వరం ఘాట్‌కు పెరిగిన తాకిడి
– ఉచిత భక్తుల కోసం తప్పని నిరీక్షణ
– శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద సాధారణం
– లింగాలగట్టులో రద్దీ
– ఘాట్లను పరిశీలించిన కలెక్టర్, ఐజీ, డీఐజీ, ఎస్పీలు
శ్రీశైలం: శ్రావణ మాసం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టుతో పాటు సంగమేశ్వరం, నెహ్రూనగర్, ముచ్చుమర్రి ఘాట్లలో పుష్కర స్నానం చేసి భక్తులు తరించారు. గత వారం రోజుల్లో సుమారు 5.90 లక్షలకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అంచనా. శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద భక్తుల రద్దీ సాధారణం కాగా.. లింగాలగట్టు వద్ద సందడి కనిపించింది. ఇదే ప్రాంతంలో పిండ ప్రదానాలు అధిక సంఖ్యలో నిర్వహించారు. ఇక సంగమేశ్వరం వద్ద ఉదయం నుంచే భక్తుల రాక మొదలయింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రద్దీ అధికం కాగా.. సుమారు 2 గంటల పాటు ఉచిత బస్సుల కోసం క్యూలలో నిరీక్షించాల్సి వచ్చింది. జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఒకానొక దశలో ఆయనే స్వయంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారడం విశేషం.
ఘాట్లను పరిశీలించిన కలెక్టర్, ఐజీ, ఎస్పీ
శ్రీశైలంలోని లింగాలగట్టు పుష్కరఘాట్‌ను జిల్లా కలెక్టర్ విజయమోహన్, రాయలసీమ జోన్ ఐజీ శ్రీధర్‌రావు, ఎస్పీ రవికృష్ణలు పరిశీలించారు. ఏర్పాట్లను ప్రత్యక్ష పరిశీలన చేసి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వృద్ధులు, పిల్లల సౌకర్యార్థం లింగాలగట్టు పుష్కర ఘాట్ చాలా సౌకర్యవంతంగా ఉందని, వాలంటీర్లు కూడా సేవా దక్పథంతో వ్యవహరిస్తున్నారని భక్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. శానిటేషన్ పరంగా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని, ఘాట్ల వద్ద ఎలాంటి పారిశుద్ధ్య సమస్య తలెత్తినా ఆ ఘాట్ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్, ఐజీ హెచ్చరించారు. శ్రీశైలంలోని మల్లికార్జున ఘాట్ వద్ద నీటి నమూనాలను పరిశీలించిన కలెక్టర్ కలుషితమయినట్లు గుర్తించారు. వెంటనే ఆ నీటిని పంపింగ్ చేయాలని ఆదేశించారు.
ఘాట్లలో వీఐపీల పుష్కర స్నానాలు
కృష్ణా పుష్కరాల్లో భాగంగా 7వ రోజు గురువారం జిల్లా వ్యాప్త పుష్కర ఘాట్లలో పలువురు వీఐపీలు పుణ్య స్నానాలను ఆచరించారు. శ్రీశైలం పాతాళగంగ వద్ద రాయలసీమ జోన్ ఐజీ శ్రీధర్‌రావు, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యుడు రవిబాబు, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి లక్ష్మణ్‌రావులు పుష్కర స్నానాలు ఆచరించిన వారిలో ఉన్నారు. అదేవిధంగా లింగాలగట్టు పుష్కర ఘాట్‌లో మాజీ ఎంఎల్‌ఏ లబ్బి వెంకటస్వామి, సంగమేశ్వరం వద్ద నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పుష్కర జలాలను తలపై చల్లుకున్నారు. ఇక్కడే బనగానపల్లె వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి కాటసాని రామిరెడ్డి దంపతులు పుష్కర స్నానం చేశారు. నెహ్రూనగర్ వద్ద వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పుష్కర స్నానం ఆచరించారు.
Advertisement
Advertisement