‘ఓపి’కకు పరీక్ష | 'Op'ikaku test | Sakshi
Sakshi News home page

‘ఓపి’కకు పరీక్ష

Published Mon, Aug 1 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

సర్వజనాస్పత్రి ఓపీ కౌంటర్ల వద్ద కిక్కిరిసిన రోగులు

సర్వజనాస్పత్రి ఓపీ కౌంటర్ల వద్ద కిక్కిరిసిన రోగులు

– జిల్లా వ్యాప్తంగా విజంభిస్తున్న జ్వరాలు
– ప్రభుత్వాస్పత్రులకు తరలివస్తున్న రోగులు
–సోమవారం ఒక్కరోజే 8,400 మంది ఔట్‌పేషెంట్లు
 
అనంతపురం సిటీ: 
రోగాల గుప్పెట్లో ‘అనంత’ బందీ అయింది. విషజ్వరాలు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయి పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లలో తలమునకలైపోవడంతో ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. జ్వరాలు తగ్గకపోవడంతో బాధితులు ప్రభుత్వాస్పత్రులకు క్యూ కట్టారు. సోమవారం జిలా వ్యాప్తంగా ఓపీ సేవలకు హాజరైన రోగుల సంఖ్య 8400. జ్వరాల తీవ్రత ఏ స్థాయిలో ఈ సంఘటన అద్దం పడుతోంది.
 
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దోమల బెడద విపరీతంగా పెరిగి సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆస్పత్రుల ఆవరణ లన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. సోమవారం ఒక్క రోజే అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చిన ఓపీ రోగుల సంఖ్య 1600గా నమోదైంది. జిల్లా వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని 19 కేంద్రాల్లో (హిందూపురం, మడకశిర, రాయదుర్గం, గుత్తి, కదిరి, పెనుకొండ, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, సీ.కే.పల్లి, శింగనమల, నల్లమాడ, కళ్యాణదుర్గం, కణేకల్లు, కొనకొండ్ల, పామిడి, తనకల్లు సీ.హెచ్‌.సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు) 6,800 మంది ఓపీ సేవలు పొందినట్లు వైద్యాధికారులు తెలిపారు. సర్వజనాస్పత్రి ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న జ్వరపీడితులు 68 మంది ఉన్నారు. పది రోజులుగా ఈ సంఖ్యలో ఎటువంటి మార్పూ  రాలేదని ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు వెల్లడించారు. 
 
పీహెచ్‌సీలలో వైద్యసేవలు మృగ్యం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసం జ్వరాలకు కూడా సరైన వైద్య సేవలందడం లేదని తెలుస్తోంది. మందుల కొరత కూడా తీవ్రంగా ఉందని రోగులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే చాలా మంది రోగులు పెద్దాస్పత్రులకు వస్తున్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు. 
 
సీజన్‌లో సంఖ్య పెరుగుతుంది
జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దగ్గు, జలుబుతో పాటు పలు రకాల జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య  ఎక్కువే. అలాగని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పని చేయడం లేదన్నది అవాస్తవం. కొన్ని జ్వరాలు మందులకు లొంగవు. దీంతో జిల్లా కేంద్రాని వచ్చి చికిత్సలు పొందుతూ ఉండవచ్చు. ఫాగింగ్, డయేరియా రాకుండా జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఏ గ్రామంలోనైనా మలేరియా, డెంగీ, డయేరియా వ్యాధులు ప్రబలుతున్నట్లు తెలిస్తే నా నంబరు 98499 02397కు ఫోన్‌ చేసి నేరుగా సమాచారం ఇవ్వవచ్చు. 
–వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement