ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయి
- భారీ నీటిపారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావు
మద్దూరు : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతిపక్ష పార్టీలు కావాలనే రైతును రెచ్చగొడుతున్నాయని భారీ నీటిపారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా మద్దూరు మండలం ధూల్మిట్టలో ఆదివారం ఆయన మెుక్కలు నాటారు. అనంతరం‘ఆణిముత్యాలు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు 15 ఏళ్లయినా పూర్తి కాలేదని, దీనితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును రెండు, మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామని చెప్పారు. రైతులకు గత ప్రభుత్వాలు ఎకరానికి రూ.1.25 లక్షలు ఇస్తే, తమ ప్రభుత్వం రూ.7 లక్షలు చెల్లిస్తోందని చెప్పారు.
యుద్ధప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేసి, ప్రాజెక్టులు, రిజర్వాయర్ నిర్తిస్తామన్నారు. దీంతో మద్దూరు, చేర్యాల, నంగునూరు, కొండపాక మండలాలకు రెండు పంటలకు సరిపడ నీరందిస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 24,912 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, 17,581 ఉద్యోగాలకు డీఎస్సీ, వైద్య ఆరోగ్య, పోలీసు తదితర శాఖల ద్వారా నోటిఫికేషన్‌లు విడుదల చేశామని అన్నారు. 25 వేల కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటి వరకు 63,400 ఉద్యోగాలు ఇప్పించామని, మరో రెండు ఏళ్లలో లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, పాతూరి సుదాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంగౌడ్ పాల్గొన్నారు.