- వేసవి శిక్షకులకు శాప్ ఓఎస్‌డీ రామకృష్ణ సూచన
అనంతపురం సప్తగిరి సర్కిల్ : వేసవి శిక్షణ తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని శాప్ ఓఎస్‌డీ రామకృష్ణ శిక్షకులకు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా ప్రాదికార సంస్థ కార్యాలయంలో వేసవి శిక్షకులకు శిక్షణ సామగ్రి కొనుగోలుకు చెక్కులను అందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 శిక్షణ కేంద్రాలకు రూ.7వేలు చొప్పున 3.50లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శాప్ ఓఎస్‌డీ రామకృష్ణ మాట్లాడుతూ శిక్షణ సామగ్రి కొనుగోలు చేసి వాటి రసీదులను కార్యాలయంలో అందించాలన్నారు. ఆయా కేంద్రాలు ఉదయం 5.30 నుంచి 7.30 వరకు...అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 7 వరకు నిర్వహించాలన్నారు. ఆయా కేంద్రాల్లో 30 మంది క్రీడాకారులు లేకపోతే అలాంటి కేంద్రాలను రద్దు చేస్తామన్నారు. కేంద్రాలను నడిపేందుకు అలసత్వం ప్రదర్శించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్, తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురుస్వామి, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు, కొండారెడ్డి, సిరాజుద్దీన్, జీవన్‌కుమార్, మనోహర్‌రెడ్డి, జబీవుల్లా, ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.