టీచర్లకు వేసవిలో శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి జిల్లా అధికారులను సోమవారం ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిలో నైపుణ్యం గల శిక్షకులను (రిసోర్స్ పర్సన్స్) గుర్తించాలని సూచించారు. దీనికోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో జిల్లా విద్యాశాఖాధికారి కన్వినర్‌గా, డైట్ కాలేజీ ప్రిన్సిపాల్, క్వాలిటీ కో–ఆర్డినేటర్, ముగ్గురు సబ్జెక్టు నిపుణు లు సభ్యులుగా ఉంటారు.శిక్షణ కార్యక్రమాన్ని గతం కన్నా భిన్నంగా నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో రిసోర్స్ పర్సన్ ఎంపికకు ప్రామాణికాలను రూ పొందించింది. వచ్చిన దరఖాస్తులను అనేక కోణాల్లో వడపోసి ఎంపిక చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ముందుగా రిసోర్స్ పర్సన్స్‌కు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇస్తారు. వీళ్లు జిల్లా, మండల స్థాయిలో టీచర్లకు శిక్షణ ఇస్తారు. రిసోర్స్ పర్సన్ ఎంపిక ఈ నెల 30లోగా పూర్తి చేయాలని సూచించారు. ఎందుకీ శిక్షణ? కొన్నేళ్లుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. నేషనల్ అచీవ్మెంట్ సర్వే సహా అనేక జాతీయ సర్వేల్లో రాష్ట్ర విద్యా ప్రమాణాలు తగ్గినట్టు తేలింది. చదవడం, రాయడంలో కనీస ప్రమాణాలు కన్పించడం లేదు. ఈ అంతరాన్ని పూడ్చడానికి ముందుగా టీచర్లలో మార్పు తేవాలని విద్యాశాఖ భావిస్తోంది.విద్యార్థుల స్థాయిని గుర్తించడం, వెనుకబడిన వారికి అర్థమయ్యేలా బోధన చేయడం, మారుతున్న బోధన విధానాలను అనుసరించడం, సిలబస్‌లో మార్పులను అవగతం చేసుకోవడంతో పాటు సాంకేతిక విద్యా విధానాలపై శిక్షణ ఇస్తారు. ఢిల్లీలో సరికొత్త బోధన మెళకువలు అనుసరిస్తున్నారు. కేరళలో డిజిటల్ విద్యపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు. మహారాష్ట్రలో పాఠశాల స్థాయిలో విద్యా ప్రమాణాలపై అంచనాలను రూపొందిస్తున్నారు. ఇదే స్థాయిలో తెలంగాణలోనూ ముందుగా టీచర్ల బోధన పటిమను పెంచేలా శిక్షణ ఇస్తారు. అర్హులకే అవకాశంరిసోర్స్ పర్సన్ ఎంపికలో బోధన అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. కనీసం పోస్టు–గ్రాడ్యుయేషన్ విద్యార్హత ఉండాలని విద్యాశాఖ సూచించింది. గతంలో శిక్షణ ఇచ్చిన అనుభవం, సబ్జెక్టులో నైపుణ్యం, అత్యాధునిక బోధన ప్రమాణాల్లో నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుంటారు. ప్రతి సబ్జెక్టు నుంచి నలుగురిని ఎంపిక చేస్తారు. వీరిని ఎంపిక చేసేప్పుడు ఒక్కో అంశానికి కొన్ని మార్కులను ఎంపిక కమిటీ ఇస్తుంది.ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వారిని మాత్రమే ఎంపిక చేస్తారు. సబ్జెక్టు నైపుణ్యం, కమ్యూనికేషన్ ప్రజెంటేషన్, బోధనలో నైపుణ్యం, డిజిటల్ టూల్స్ వాడుతూ బోధించటం వంటి ఒక్కో విభాగానికి పది మార్కులు కేటాయిస్తారు. ఇన్నోవేటివ్ ప్రాక్టీస్, ట్రైనింగ్ అవసరాలపై ఇచ్చే ప్రజెంటేషన్‌కు ఒక్కో దానికి ఐదు మార్కుల చొప్పున ఉంటాయని అధికారులు తెలిపారు.