విషాదం మిగిల్చిన అతివేగం
విషాదం మిగిల్చిన అతివేగం
Published Mon, Mar 6 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
–వరుసగా ట్రాక్టరు, ఆటోను
ఢీ కొన్న ఆర్టీసీ బస్సు
– ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
– ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన
ముగ్గురు చిన్నారులు
– కన్నీరు మన్నీరుగా విలపించిన బంధువుల
ఆదోని టౌన్: ఆదోని– ఆస్పరి రోడ్డులోని మిల్టన్ హైటెక్ స్కూల్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్, ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా..ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు, మృతుడి బంధువులు వాపోయారు. తాలూకా ఎస్‌ఐ నీలకంఠేశ్వర తెలిపిన వివరాలు మేరకు.. పుట్టపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంత్రాలయం నుంచి పుట్టపర్తికి వెళ్తొంది. ఆస్పరి రోడ్డులోని మిల్టన్ హైటెక్ స్కూల్ వద్ద బస్సు ముందు వెళు్తన్న శంకరబండకు చెందిన ట్రాక్టరును ఢీ కొట్టింది. ట్రాక్టరు ఇంజిన్ నుజ్జు నుజ్జు అయింది. ట్రాలీ రోడ్డు పక్కన ఎగిరి పడింది. తర్వాత కొద్ది ముందుకు వెళ్లి ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న ఆటోను బసు్స ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఆటోలోని ముగ్గురు బాలికలు,ఒక బాలుడు, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ నీలకంఠేశ్వర సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకొని ప్రమాద వివరాలను ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి తరలించిన ఏడుగురిలో ఆస్పరి మండలం బిణిగేరికి చెందిన డబ్బల రామాంజనేయులు(42) చికిత్స మొదలవ్వకముందే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన బాలుడు లక్ష్మన్న గాయాలుకాగా చిరుమాన్‌దొడ్డికి చెందిన పెద్ద అంజినయ్య(55) రెండు కాళ్లు నుజ్జు అయ్యాయి. ట్రాక్టరు డ్రైవరు వీరేష్‌కు రక్త గాయాలయ్యాయి.
ఒకే కుటుంబంలో ముగ్గురికి ప్రమాదం
ఆటోను బస్సు ఢీకొన్న ఘటనలో ఆస్పరి మండలం బిణిగేరి గ్రామానికి చెందిన లక్ష్మన్న, మంగమ్మ దంపతుల ముగ్గురు కూతుళ్లు ఉమ, రేవతి, ఉష తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు పదేళ్ల లోపు వయస్సు ఉన్నవారే. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుళ్లు ప్రమాదంలో గాయపడడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘అయ్యా.. డాక్టరు సారూ.. నాకూతుళ్లను బాగు చేయండంటూ’ తల్లి మంగమ్మ విలపించిన తీరు పక్కనున్న వారికి కంట తడి పెట్టించింది. పిల్లలతో కలిసి ఈ దంపతులు కమ్మరచేడు జాతరకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నీలకంఠేశ్వర తెలిపారు.
Advertisement
Advertisement