ఓయూ ఉమెన్స్ కళాశాలకు అరుదైన గౌరవం
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్ కళాశాలకు అరుదైన గౌరవం దక్కింది. యూజీసీ నుంచి ‘కాలేజ్ విత్ పొటెన్షియల్ ఎక్స్‌లెన్స్(సీపీఈ)’ గుర్తింపు లభించింది. 1924లో ఏర్పాౖటెన ఈ కళాశాలలో నాణ్యమైన బోధన, ఉత్తమ పరిశోధనలు, మెరుగైన మౌలిక వసతుల తీరుపై సంతృప్తి చెందుతూ యూజీసీ సీపీఈతో సత్కరించింది. 2016–21 వరకు సీపీఈ చెల్లుబాటు అవుతుంది. ఈ ఐదేళ్ల కాలానికిగాను యూజీసీ నుంచి కళాశాలకు రూ. 1.50 కోట్లు నిధులు అందనున్నాయి.
వీటితో కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుచుకోవడం, కొత్త కోర్సుల ఏర్నాటు, లైబ్రరీ ఎక్స్‌టెన్షన్, ల్యాబ్ అప్‌గ్రేడ్ తదితర కార్యక్రమాలను చేపట్టే వీలుంది. రెండేళ్ల క్రితం న్యాక్ ద్వారా రెండో సారి ‘ఏ’ గ్రేడ్ సొంతం చేసుకున్న కళాశాలకు సీపీఈ గుర్తింపు దక్కడం విశేషం. ‘నాణ్యమైన బోధన, విస్తృత స్థాయిలో మౌలిక వసతులున్న దృష్ట్యా సీపీఈ గుర్తింపు దక్కడం చాలా సంతోషం. 92 ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాలకు సీపీఈ హోదా దక్కడం ఇది మూడోసారి. ఈ గుర్తింపుతో మా బాధ్యత మరింత పెరిగింది’ అని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీత పేర్కొన్నారు.