పెరగని జిలకర మసూర ధరలు
ముత్తుకూరు : జిలకర మసూర ధాన్యం ధరలకు రెండు నెలలుగా కదలిక లేకుండాపోయింది. దీంతో మద్దతు ధర కోసం రైతులు వందలాది పుట్ల ధాన్యం నిల్వ చేసుకొని, నిరీక్షిస్తున్నారు. మొదటి పంట కింద దిగుబడి జరిగిన ధాన్యం ధర ప్రస్తుతం పుట్టి రూ.17,500 నుంచి రూ.18 వేల వరకు ఉంది. ఈ ధర పెరగక, తగ్గకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితికి గురయ్యారు. ఈ ధరకు అమ్మకాలు జరగకపోవడంతో పొట్టెంపాడు, బ్రహ్మదేవి, డమ్మాయపాళెం ప్రాంతాల్లో వందలాది పుట్ల జిలకర మసూర ధాన్యం కుప్పలు మద్దతు ధరకు నిరీక్షిస్తున్నాయి. ఎండకు, వానకు నాణ్యత దెబ్బతినకుండా ప్లాస్టిక్ పట్టలు కట్టి, జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. ప్రైవేటు గిడ్డంగుల్లో దాచుకొన్నారు. ధర ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు.