పల్లె ఔట్‌.. కాలవ ఇన్‌ | palle lost and kalva won | Sakshi
Sakshi News home page

పల్లె ఔట్‌.. కాలవ ఇన్‌

Published Sun, Apr 2 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

పల్లె ఔట్‌.. కాలవ ఇన్‌

పల్లె ఔట్‌.. కాలవ ఇన్‌

చివరి నిమిషంలో చాంద్‌కు చేజారిన అవకాశం
– కాలవకు మంత్రి పదవి కట్టబెట్టడంతో మెజార్టీ ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తల్లోనూ వ్యతిరేకత
– పార్టీకోసం శ్రమించిన బీకే పార్థసారథి, పయ్యావులకు చంద్రబాబు మొండిచేయి
– సిసలైన కార్యకర్తలను గుర్తించడంలో అధిష్టానం విఫలమైందని పెదవివిరుపు
– ‘అనంత’ టీడీపీలో చిచ్చురేపుతోన్న మంత్రివర్గ విస్తరణ


(సాక్షి ప్రతినిధి, అనంతపురం) :
రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై చంద్రబాబు వేటు వేశారు. చీఫ్‌విప్‌ కాలవ శ్రీనివాసులుకు పదోన్నతి కల్పించి కేబినెట్‌లో చోటు కల్పించారు. పార్టీ కోసం సుదీర్ఘంగా శ్రమించిన తమకు మంత్రి పదవి లభిస్తుందని బీకే పార్థసారథి, పయ్యావుల కేశవ్‌ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన వారికి కాకుండా ‘రిజర్వేషన్ల’ పేరుతో రాజకీయం చేసేవారికి మంత్రి పదవి కట్టబెట్టడంపై బీకే, కేశవ్‌ తీవ్రంగా రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ‘అనంత’లోని మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా కాలవకు పదోన్నతి కల్పించడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్గ విభేదాలతో జిల్లాలో బలహీనపడిన టీడీపీలో తాజా మంత్రివర్గ విస్తరణ చిచ్చురేపుతోంది.

    2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ 12 అసెంబ్లీస్థానాల్లో విజయం సాధించింది. టీడీపీకి అధికారం దక్కిన తర్వాత పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతకు చంద్రబాబు కేబినెట్‌లో చోటు కల్పించారు. అయితే వీరిద్దరి పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పదవులు అడ్డుపెట్టుకుని వ్యక్తిగతంగా, ఆర్థికంగా లబ్ధి పొందడం మినహా పార్టీ బలోపేతానికి వీరు ఎలాంటి చర్యలకూ ఉపక్రమించలేదనే నిర్ణయానికి వచ్చారు. మంత్రివర్గ విస్తరణలో ఇద్దరినీ తప్పించి కొత్తవారిని తీసుకోవాలని భావించారు. అయితే పల్లె రఘునాథరెడ్డిని మాత్రమే తప్పించి సునీతను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఖాళీ స్థానంలో బీసీలకు కేటాయించాల్సి వస్తే పార్టీలో సీనియర్‌ నేత అయిన తనకే ప్రాధాన్యం ఉంటుందని జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి భావించారు. పదేళ్ల పాటు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా, జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ఉన్నతి కోసం శ్రమించానని, తనకు చోటు ఖాయమనుకున్నారు. ఇదే క్రమంలో 2004–14 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా జిల్లాలో పార్టీ ఉన్నతి కోసం పాటుపడిన వారిలో తాను కూడా ఉన్నానని, 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతోనే మంత్రి పదవి దూరమైందని, విస్తరణలో తనకూ చోటు దక్కుతుందని కేశవ్‌ ఆశపడ్డారు. పైగా కేబినెట్‌ స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌గా కేశవ్‌ను నియమించడంతో విస్తరణలో తన ఎంట్రీ ఖాయమనుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం పార్టీ కోసం శ్రమించిన వారికి మొండిచేయి చూపించి ‘లాబీయింగ్‌’కే చోటు కల్పించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాలవకు చోటుపై ఎమ్మెల్యేల మండిపాటు
కాలవ శ్రీనివాసులు 1999 వరకు జర్నలిస్టుగా పనిచేశారు. అనంతపురం ఎంపీగా బీసీ, బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో కాలవ శ్రీనివాసులు పేరును పయ్యావుల కేశవ్‌ అప్పట్లో సిఫార్సు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఎన్నికల్లో కాలవ విజయం సాధించారు. ఆపై 2004, 2009 ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూశారు. ఆపై 2014 ఎన్నికల్లో కూడా రాయదుర్గం టిక్కెట్టును కేశవ్‌ ఇప్పించారని చెబుతున్నారు. 2004–14 వరకు ఓడిపోయిన పదేళ్లు మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం మినహా పార్టీ అభివృద్ధి కోసం ఏ రకంగానూ కాలవ పాటుపడలేదని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.

జిల్లాలో ఇప్పటి వరకు కాలవకు ఓ కేడర్‌ లేదని, వ్యక్తిగతంగా కనీసం 500 ఓట్లను సాధించే చరిష్మా కూడా లేదంటున్నారు. ఇలాంటి వ్యక్తికి చీఫ్‌విప్‌గా చోటు కల్పించారని, అయినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని శిరసావహించామంటున్నారు. కానీ పని చేసిన వారికి న్యాయం చేయాల్సిన సమయంలో చంద్రబాబు రిజర్వేషన్లను సాకుగా చూపి తమకు మొండిచేయి చూపారని కేశవ్, పార్థ తీవ్రంగా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. బీసీలకు ఇవ్వాల్సి వస్తే తనకంటే కాలవకు ఉన్న అర్హతలేమిటో చెప్పాలని బీకే తన సన్నిహిత ఎమ్మెల్యేతో వాపోయినట్లు తెలుస్తోంది.

నిర్వేదంలో కేశవ్‌
మంత్రివర్గంలో ఎలాగైనా చోటు దక్కించుకోవాలని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ విశ్వప్రయత్నాలు చేశారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ధర్మవరం, అనంతపురం ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, ప్రభాకర్‌చౌదరితో పాటు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా కేశవ్‌ పేరును పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే లోకేశ్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడంతో రాష్ట్రంలో మరో కమ్మ సామాజిక వర్గం వారికి చోటు కల్పించలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో కేశవ్‌ తీవ్ర నిరాశ చెందినట్లు తెలుస్తోంది.

మంత్రి పరిటాల సునీతను దాదాపు మూడేళ్లపాటు కొనసాగించారని, పార్టీ కోసం శ్రమించినా తనకూ రెండేళ్లు అవకాశం ఇవ్వలేరా? అని కేశవ్‌ సన్నిహితులతో వాపోయినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఎంత శ్రమించినా ఫలితం లేదన్నపుడు, ఎందుకు పార్టీ ఉన్నతి కోసం పాటుపడాలని కేశవ్‌ వారితో వేదనపడ్డారని తెలుస్తోంది. విస్తరణలో పార్టీ సమన్యాయం చేయకపోగా పార్టీ కోసం శ్రమించినవారిని కాదని పత్రికా యజమానులు చెప్పిన వారికి చోటు కల్పించారని, వచ్చే ఎన్నికల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మెజార్టీ ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవి కోల్పోయిన పల్లె రఘునాథరెడ్డికి చీఫ్ విప్ ఇస్తారని సమాచారం.
 
అయ్యో అత్తార్‌
కదిరి ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషాకు మైనార్టీ కోటాలో తొలుత కేబినెట్‌లో బెర్త్‌ ఖరారు చేశారు. దీంతో ‘అనంత’కు మూడు మంత్రుల పదవులు వచ్చినట్లు అయ్యింది. తనకు మంత్రి పదవి ఖరారు అయిందనే సమాచారాన్ని చాంద్‌బాషా కదిరిలోని తన కుటుంబ సభ్యులు, అనుచరులకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. దీంతో కదిరిలో అత్తార్‌ అనుచరులు భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సంబరాల్లో మునిగి ఉండగానే టీవీలో షాకింగ్‌ న్యూస్‌ వెలువడింది. ఆఖరి నిమిషంలో చాంద్‌బాషా స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు బీసీ కోటాలో చంద్రబాబు మంత్రి పదవి ఖరారు చేశారు. దీంతో అత్తార్‌ మంత్రి పదివి ఆశలు అడియాసలు అయ్యాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement