అయ్యో ‘పాప’ం.. అంజలి
కురవి : తెలిసీ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయింది.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో మంచం పట్టిన తల్లి ఆదివారం మృతిచెందింది. ఇప్పుడు ఆలన పాలన చూసేవారు లేక అనాథగా మిగిలింది ఐదేళ్ల చిన్నారి. స్థానికుల సహాయంతో ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి తల్లి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లా కురవి మండలం తట్టుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి..
గ్రామానికి చెందిన జిలకర నారాయణ, సుభద్ర కూతురు స్వరూప(40). చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. నారాయణ ఆమెను పెంచి పెద్దచేసి వివాహం చేశాడు. కొన్ని రోజుల తర్వాత భర్తను వదిలేసిన స్వరూప ఆ తర్వాత చిన్నా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారికి కూతురు అంజలి జన్మించింది. స్వరూప, చిన్నా హైదరాబాద్‌లో కూలీ పనిచేస్తూ జీవించేవారు. నాలుగేళ్ల క్రితం చిన్నా అనారోగ్యంతో మృతి చెందగా, స్వరూప అంజలితో హైదరాబాద్‌లోనే ఉంటూ కూలీ పని చేస్తుండేది. నాలుగు నెలల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో పుట్టిల్లయిన తట్టుపల్లికి వచ్చింది. అప్పటికే తండ్రి మరణించగా, అతడి ఇంట్లోనే కూతురుతో కలిసి ఉంటోంది. కాగా, స్వరూప ఆరోగ్యం మరీ క్షీణించడంతో ఐదేళ్ల కుమార్తె అంజలి ఇంటింటికీ తిరిగి అన్నం అడుక్కుని వచ్చి తల్లికి తినిపించేది. మిగిలిన అన్నం తాను తినేది. ఈ క్రమంలో ఆదివా రం స్వరూప కూడా మృతిచెందింది.
చందాలు పోగుచేసి అంత్యక్రియలు..
తల్లి అంత్యక్రియల కోసం ఇంటì æపక్కన ఉండే ఎ మ్మార్పీఎస్ నాయకుడు మందుల శ్రీను, వెంపటి చంద్రయ్య, అనుముల రాములు, ఎడెల్లి వెంకన్న త దితరుల సహాయంతో అంజలి ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసింది. వెయ్యి రూపాయలు పోగయినా, అవి సరిపోకపోవడంతో స్థానిక జర్నలిస్టులు అధికారులకు తెలియజేశారు. దీంతో తహసీల్దార్ జన్ను సంజీవ రూ.3 వేలు, సీఐ శ్రీనివాస్ రూ.3 వేలు, ఎస్సై అశోక్, సీనియర్ పాత్రికేయుడు దొంతు రమేష్, సర్పంచ్ లక్‌పతి రూ.2 వేల చొప్పున అందజేయగా, అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.
అనాథగా మిగిలిన అంజలి...
చిన్నప్పుడే తండ్రిని.. ఇప్పుడు తల్లిని కోల్పోయిన అంజలి అనాథగా మిగిలింది. ఆకలికి తట్టుకోలేక తల్లి మృతదేహం పక్కనే కూర్చుని అన్నం తింటుండడాన్ని చూసిన స్థానికులు బోరున విలపించారు. దీనంగా తల్లి మృతదేహాన్ని పట్టుకుని లే..లెమ్మంటూ పిలుస్తుండడాన్ని చూసిన వారు తట్టుకోలేకపోయారు. నా అనే వాళ్లు లేని అంజలికి ఇప్పుడు దిక్కెవరంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అంజలి విషయాన్ని జర్నలిస్టులు చైల్డ్‌లైన్ సంస్థకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైన్ అధికారులు లేదా ఎవరైనా దాతలు అంజలిని తీసుకెళ్లి పోషించాలని స్థానికులు కోరుతున్నారు. లేదా ఏదైనా హాస్టల్‌లో చేర్పించి చదివించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.