ప్రపంచీకరణతో పెట్టుబడిదారీ వ్యవస్థ బలోపేతం
Published Wed, Feb 8 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శివశంకర్
రాజమహేంద్రవరం కల్చరల్ (రామమహేంద్రవరం సిటీ) : ప్రపంచీకరణతో పెట్టుబడీదారి వ్యవస్థ బలోపేతమై సామాజిక జీవితం ధ్వంసమైందని సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. సాహితీగౌతమి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రపంచీకరణపై ప్రసంగించారు. దీంతో అంతటా నైతిక అంధత్వం వ్యాపించిందన్నారు. మీటనొక్కితే విశ్వవ్యాప్త సమాచారం లభిస్తోందని అయితే సమాచారం, విజ్ఞానం వేర్వేరన్నారు. రాజధాని నిర్మాణం పేరిట వేలాది పంట పొలాలను సేకరిస్తోన్న ప్రభుత్వం ఉద్యోగాలు వస్తాయని చెబుతోందని, కొన్ని ఉద్యోగాలు రావచ్చేమో కాని పరిశ్రమల వల్ల వచ్చే రూ.కోట్ల ఆదాయం ఎవరి జేబులోకి వెడుతోందని ప్రశ్నించారు. సజ్జ, జొన్నరొట్టె, రాగి సంగడికి బదులు వచ్చిన జంక్ ఫుడ్‌తో ఆరోగ్యాలు ధ్వంసమవుతున్నాయన్నారు. ప్రపంచీకరణ వలన ఉద్యోగ భద్రత, స్థిరత్వం పోయాయని, అతి పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగికి తెల్లారేటప్పటికి ఉద్వాసన వచ్చే పరిస్థితి ఏర్పడందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం తీసేస్తే కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుందన్నారు. అమెరికాలో ఉద్యోగి జీవితకాలంలో కనీసం 11 ఉద్యోగాలు మారతాడన్నారు. ప్రపంచం ఎట్లా ఉంది? ఎలా ఉండాలి? అనే అంశంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. సాహితీ గౌతమి వ్యవస్ధాపకుడు పి.విజయకుమార్, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, కమ్యూనిస్టు, హేతువాది వెలమాటి సత్యనారాయణ, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రముఖ పర్యావరణ వేత్త తల్లావఝుల పతంజలి శాస్త్రి, రాష్ట్రపతి పురస్కార గ్రహీత చింతలపాటి శర్మ, విద్యార్థులు హాజరయ్యారు.
Advertisement
Advertisement