గుండెలు పగిలేలా..
గుండెలు పగిలేలా..
Published Fri, Aug 12 2016 9:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
నలుగురు విద్యార్థుల మృతితో తల్లిదండ్రుల రోదన
మృతుల గ్రామాల్లో అలముకున్న విషాదం
ప్రత్తిపాడు/పెదనందిపాడు/వట్టిచెరుకూరు: కన్నకొడుకును ప్రయోజకుడిగా చూడాలన్న ఓ తల్లి కలలు కల్లలయ్యాయి. తనయుడిపైనే కోటి ఆశలు పెట్టుకున్న మరో నాన్న ఆశలు అడిఆశలయ్యాయి. కొడుకును ఉన్నతునిగా తీర్చిదిద్దాలన్న ఇంకొక తండ్రి ఆకాంక్ష చెదిరిపోయింది. కన్నకొడుకే శ్వాసగా బతుకుతున్న మరో తల్లికి గర్భశోకమే మిగిలింది... ఇలా విధి ఆ అభాగ్యుల కుటుంబాలపై క్వారీకుంట రూపంలో విషం చిమ్మింది. గుంటూరురూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలోని క్వారీ కుంటలో ఈతకు దిగి నలుగురు విద్యార్థులు మృతి చెందడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. పున్నామ నరకం నుంచి తప్పిస్తారనుకున్న కొడుకులను కాటికి సాగనంపాల్సి రావడంతో వారి కుటుంబాల్లో విషాదం అలముకుంది. తల్లిదండ్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో ఘటనా స్థలం హృదయ విదారకంగా మారింది.
ఒక్కసారి లేనాన్న..
ఒక్కసారి లే బిడ్డా.. నీ కోసమే కదా ఈడ దాకా వచ్చాం.. అంటూ పందిరి సాయితేజ (14) కుటుంబం బోరున విలపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పందిరి అప్పారావు, అమ్మన్న దంపతులు సుమారు పదహారేళ్ల క్రితం గుంటూరురూరల్ మండలం చౌడవరం వలస వచ్చారు. స్థానిక స్పిన్నింగ్ మిల్లులో కార్మికులుగా పనిచేసుకుంటూ కూతురు, కుమారుడు సాయితేజను చదివించుకుంటున్నారు. కుమారుడి మృతితో వారి రోదించడం వారిని కంటతడి పెట్టించింది.
కంటికి రెప్పలా పెంచి..
కంటికిరెప్పలా పెంచుకున్నాడు. తనకున్నదానిలో అడిగినవన్నీ ఇచ్చాడు. గారాభంగా చూసుకుంటున్న కుమారుడు ఒక్కసారిగా మృతిచెందడంతో ఆ తండ్రి గుండె పగిలిపోయింది. గుంటూరురూరల్ మండలం జూనంచుండూరు గ్రామానికి చెందిన కనపర్తి మాణిక్యరావు, కనకాంబరం దంపతులు వ్యవసాయకూలీలు. వీరికి కుమార్తె తిరుమల దేవి, కుమారుడు మహేష్ ఉన్నారు. కుమార్తె ఇంటర్మీడియెట్ చదువుతోంది. కొడుకు మహేష్‌ను ఇంగ్లీషుమీడియం చదివిస్తున్నారు. మహేష్ మృతితో తండ్రి బాధ మాటల్లో చెప్పలేకుండా ఉంది. కొడుకు మృతదేహాన్ని చేతుల్లోకి తీసుకుని పదేపదే ముద్డాడుతూ ఆ తండ్రి తన ప్రేమను చాటడం అక్కడున్న వారందరికీ కన్నీటిని తెప్పించింది.
చివరి ఆశగా..
కన్నకొడుకు కళ్ల ఎదుటే నిర్జీవంగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రుల గుండెలు అవిశిపోయాయి. ఒక్కసారి లేరా అభి.. మా నాన్నవి కదూ ఒక్కసారి లే.. అంటూ గుండెలపై తడుతూ అభిషేక్ తల్లి రోధించిన తీరు స్థానికుల మనసులను కలిచివేసింది. కొన ఊపిరి ఉందేమో అని చివరి ఆశగా కొడుకు గుండెలపై కొడుతూ ఆ తల్లి ప్రయత్నాలు చేయడం స్థానికుల గుండెలను పిండేసింది. గుంటూరురూరల్ మండలం చౌడవరం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ చుక్కా నానిబాబు, చిట్టి మరియమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు అభిషేక్ మరణించడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఒక్కసారి చూడయ్యా..
ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా.. నీ కోసమే బతుకుతున్నాం.. ఆ దేవుడు మమ్మల్ని తీసుకోపోకుండా నిన్ను తీసుకుపోయాడు.. అంటూ జూనంచుండూరుకు చెందిన పోలిశెట్టి శ్రీనివాసరావు, విజయ దంపతులు బోరున విలపించారు. వీరికి కుమార్తె, కుమారుడు గోపీచంద్ ఉన్నారు. తండ్రి ఆటో నడుపుకుంటూ ఇద్దరినీ చదివిస్తున్నాడు. గోపీచంద్ మరణించడంతో వారి బాధ మాటల్లో చెప్పలేకుండా ఉంది.
Advertisement
Advertisement