పెద్దపల్లి ఎస్సై ఆత్మహత్య
నాలుగు రోజుల క్రితమే జమ్మికుంటకు బదిలీ
అన్యాయంగా బదిలీ చేశారంటూ మనస్తాపం!
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్సై జగన్‌మోహన్ శుక్రవారం రాత్రి తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 10 నెలల క్రితం పెద్దపల్లి ఎస్సైగా వచ్చిన ఆయన.. 4 రోజుల క్రితమే జమ్మికుంటకు బదిలీ అయ్యారు. బదిలీ విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ సన్నిహితుల వద్ద జగన్‌మోహన్ పలుమార్లు కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం. తనను పెద్దపల్లిలోనే కొనసాగించాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని కలసి ప్రాధేయపడినా.. బదిలీ ఆగలేదని చెబుతున్నారు. దాంతో మానసిక వేదనకు గురైన జగన్‌మోహన్ 4 రోజులుగా తన క్వార్టర్స్ నుంచి బయటకు రావడం లేదని బంధువులు తెలిపారు.
ఆయన ఆత్మహత్యకు ఎమ్మెల్యే రాజకీయాలే కారణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే ఆయనను అన్యాయంగా బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసు అధికారులు దాచిపెడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జగన్‌మోహన్‌కు పిల్లల్లేరు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో భార్య ఒక్కరే ఇంట్లో ఉన్నారు.