దుంప తెంపింది..!
దుంప తెంపింది..!
Published Sat, Jun 24 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM
- తగ్గిన ధర.. దిగుబడి పతనం
- నష్టాల పాలవుతున్న పెండలం రైతులు
- ఎకరానికి రూ.60 వేల నష్టం
- ఇక పంటలు సాగుచేయలేమంటున్న రైతులు
- చేదెక్కిస్తున్న చేమ
పిఠాపురం: పెండలం సాగు రైతును నిండాముంచేసింది. ఒక్కసారిగా ధర పతనం కావడంతోపాటు దిగుబడి తగ్గిపోవడంతో రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎకరానికి రూ.60 వేలకు పైగా నష్టాలు రావడంతో ఇక పంటలు సాగు చేయడం సాధ్యం కాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం మండలంలోని రేవడి నేలల్లో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పొలాల్లో సాగుచేసిన ఈ పంటను గత వారం రోజుల నుంచి తవ్వుతున్నారు. ఈ ఏడాది ఈ పంటసాగులో దిగుబడి నిరాశాజనకంగానే ఉండగా ధర రెండు వంతులకు పడిపోవడంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. గత ఏడాది పది టన్నుల పెండ్ల ధర రూ. 1.60 లక్షలుండగా ఈ ఏడాది రూ.లక్షకు పడిపోవడంతో కోలుకోలేని నష్టాలను చవిచూడాల్సి వస్తోందంటున్నారు. పిఠాపురం మండలం విరవాడ, విరవ, మంగితుర్తి, కోలంక, కుమారపురం, జల్లూరు, ఎఫ్‌కేపాలెం తదితర గ్రామాలతోపాటు జిల్లాలో కోనసీమ ఏరియాలోని రావులపాలెం పరిసర గ్రామాల్లోనూ, మెట్ట ప్రాంతాలైన ధర్మవరం, ఉత్తరకంచి, లంపకలోవ, లింగంపర్తి, ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం మండల గ్రామాల్లోనూ సుమారు 3,500 ఎకరాల్లో çసాగు చేశారు. ప్రస్తుతం పెండలం పంట తుది దశకు చేరుకోవడంతో దాన్ని తవ్వి తీస్తున్నారు. ఈ పంటకి వరి, చెరుకు పంటలకన్నా ఎక్కువ పెట్టుబడి ఎకరానికి రూ.లక్షకు పైగా అవ్వగా ధర పతనం కావడంతోపాటు దిగుబడి భారీగా తగ్గిపోవడంతో ఎకరానికి రూ.40 మాత్రమే ఆదాయం వస్తుండడంతో అప్పుల పాలవుతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
దిగుబడి పతనం
ఎకరానికి 14 టన్నులు దిగుబడి రావల్సిన పెండ్లం దిగుబడి ఈ ఏడాది ఐదు నుంచి ఆరు టన్నులకు పడిపోవడంతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ధర పతనం కాగా దిగుబడి సైతం పడిపోవడంతో ఎకరానికి రూ.60 వేలకు పైగా నష్టం వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు వ్యవసాయశాఖ పట్టించుకోకపోవడం వంటి కారణాలతో నష్టాలు చూడాల్సి వస్తోందంటున్నారు.
ఆగిన ఎగుమతులు
ఇదిఇలా ఉంటే ఒడిశాలో స్థానిక ప్రజలకున్న ఆనవాయితీ ప్రకారం వివాహాల సమయంలో ఒక్కో కుటుంబం 100 కేజీల వరకూ పెండలం వినియోగిస్తుంటారు. అందువల్ల మన జిల్లాలో ఉత్పత్తయిన పెండలంలో 80 శాతం ఒడిశా రాష్ట్రానికి ఎగుమతవుతోంది. ప్రసుతం ఒడిశాలో సీజన్ కాకపోవడంతో పెండలం కొనుగోలుకు వ్యాపారులెవరూ రాకపోవడంతో ఇక్కడ అమ్మకాలు నిలిచిపోయాయి. తద్వారా ధర పాతాళానికి పడిపోయింది. ఒడిశాలో తప్ప ఈ కూర పెండలం దుంపలను ఎక్కడా ఎక్కువగా వినియోగించకపోవడంతో గతంలో ఎప్పుడు లేనంతగా ఏకంగా టన్నుకు రూ.6 వేలకు పైగా ధర పడిపోవడం ఇదే మొదటిసారని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
అంతరపంటగా చేమ దిగుబడి నిరాశాజనకమే...
పెండలంలో అంతరపంటగా సాగు చేసిన చేమ పంట సైతం ఆశాజనకంగా లేకపోవడంతో కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. అంతరపంటగా సాగు చేసిన చేమ ఎకరానికి టన్ను నుంచి రెండు టన్నుల వరకు దిగుబడి వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దుంప సక్రమంగా ఊరకపోవడంతోపాటు ధరకూడా కిలో రూ.2 వరకు మాత్రమే పలుకుతుండడంతో ఏమాత్రం ఆదాయం వచ్చే మార్గం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.
ఆదుకునే వారు లేరు
మేము రైతులమేనన్న విషయం ఎవరూ గుర్తించరు. మాకు రుణమాఫీ వర్తించదు. ఏవిధంగానూ సాయం అందదు. ప్రస్తుతం ఎకరానికి రూ.60 వేలకు పైగా నష్టాలు పాలై అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కు తోచనిస్థితిలో ఉన్నాం. దిగుబడి దెబ్బతీసి ధర లేక కొనేవారు రాక ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం.
అడబాల పాపారావు, పెండలం రైతు, విరవాడ, పిఠాపురం మండలం
వ్యాపారం లేదు
గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఇంత దారుణంగా ధర పడిపోవడం చూడలేదు. దిగుబడి తగ్గిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కొనేవారు రావడం లేదు. దీంతో మేము కొనుగోలు చేయడం లేదు. అలాఅని ఇక్కడి వ్యాపారులు కొనడం లేదు. ఇక పెండలం వ్యాపారం చేయడం మనేయాలని నిర్ణయించుకున్నాం.
బాలిరెడ్డి వెంకటేశ్వరరావు, పెండలం వ్యాపారి, ధర్మవరం , ప్రత్తిపాడు మండలం.
Advertisement
Advertisement