ఈ చిన్నారికి పింఛన్ అందించరూ..!
అధికారులకు తల్లిదండ్రుల వేడుకోలు
కడప రూరల్: ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడి పేరు యెహోషువా(8). త ల్లిదండ్రులు కళావతి, వెంకటేష్. వీరు నిరుపేదలు. కడప నగరం 3వ డివిజన్ లక్ష్మీనగర్‌లోని ఎస్సీ కాలనీలో నివసిస్తున్నారు. కూలి పనులకు వెళితే గానీ పూట గడవని పరిస్థితి. ఇద్దరు సంతానం. వారిలో యెహోషువా పుట్టుకతోనే వికలాంగుడు. రెండు కాళ్లు, రెండు చేతులు, మెడ సచ్చుబడి పోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ చిన్నారికి వంద శాతం వికలత్వం ఉన్నప్పటికీ పింఛన్ అందకపోవడం గమనార్హం.
ఎన్నో మార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని ఆ బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వంద శాతం వికలత్వం ఉంటే నెలకు రూ. 1500 చొప్పున పింఛన్‌ను మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ చిన్నారి పరిస్థితి పట్ల అటు పాలకులు, ఇటు అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణం.
జిల్లా వ్యాప్తంగా ఇలా ఎందరో..
జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి పైగా వివిధ కేటగిరిలకు చెందిన అర్హులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాల్లోని అర్హులకు మాత్రమే 5 వేలకు పైగా కొత్త పింఛన్లను పంపిణీ చేసింది. మిగిలిన 8 నియోజకవర్గాల్లో 15 వేల మందికి పైగా అర్హులుండగా వారిని పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలా యోహోషువా లాంటి చిన్నారులు, ఇతరులు జిల్లా వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
ఆదుకోండయ్యా...
నా బిడ్డకు వంద శాతం వికలత్వం ఉందని డాక్టర్లు చెప్పారు. పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. మేము దళితులం. పేద వారం. మా కోసం కాదు, మా బిడ్డ కోసం పింఛన్ ఇచ్చి ఆదుకోవాలి
- కుమారుడి తల్లి కళావతి