పాత పద్ధతిలోనే పింఛన్లు
పాత పద్ధతిలోనే పింఛన్లు
Published Wed, Dec 28 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
వేలిముద్ర ఆధారిత ట్యాబ్‌ల ద్వారా పంపిణీకి చర్యలు
డీఆర్‌డీ ఏ నుంచి ఎంపీడీఓలకు ఆదేశాలు
కాకినాడ సిటీ / రాయవరం: జిల్లాలో సామాజికభద్రతా పింఛన్లను పాత పద్ధతిలోనే వేలిముద్ర ఆధారిత ట్యాబ్‌ల ద్వారా జనవరి నెల నుంచి పంపిణీ చేయనున్నారు. 50 రోజుల క్రితం రూ.500, రూ.1000 నోట్లు రద్దుతో ఏర్పడ్డ నగదు కొరత నేపథ్యంలో ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత, అభయహస్తం లబ్ధిదారులకు ప్రతీనెల ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును నగదు రూపంలో చెల్లించే విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. నేరుగా లబ్ధిదారులకు పింఛను సొమ్మును ఇవ్వకుండా వారి బ్యాంకు ఖాతాలకు వేయాలని నిర్ణయించిందే తడువుగా ఇక్కట్లను అంచనా వేయకుండా డిసెంబర్ ఒకటిన లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,75,823 మంది లబ్ధిదారుల్లో 4,48,640 మంది వృద్ధులు, వితంతువులు, చేనేత, కలుగీత, అభయహస్తం, దివ్యాంగుల్లో కొందరికి రూ.వెయ్యి చొప్పున, మరో 27,183 మంది దివ్యాంగులకు రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉండగా రూ.500 కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడం, రూ.100 నోట్లు కొరత ఉన్నందున బ్యాంకు ఖాతాలో వేసిన సొమ్ము లబ్ధిదారులకు అందక, చేతిల్లో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. తమఖాతాల్లో వేసిన సొమ్మును తీసుకునేందుకు పింఛనుదారులు బ్యాంకుల వద్ద గంటల తరబడి లైన్లలో నిల్చున్నా నగదు కొరతతో చేతికందని పరిస్థితి నెలకొంది. ఈ మేరకు అధికారులు 15 రోజుల తరువాత క్షేత్రస్థాయిలో స్వైపింగ్ మెషీన్లతో వివిధ బ్యాంకుల బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా పింఛన్ల సొమ్ము పంపిణీకి చర్యలు తీసుకోడంతో ఈ పంపిణీ ప్రక్రియ నెల పొడవునా సాగి బుధవారం 28వ తేదీతో ముగిసింది. ఈ నెలలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వెల్లువెత్తిన వ్యతిరేకతతో ప్రభుత్వం జనవరిలో యథావిధిగా పాత పద్ధతిలోనే పంపిణీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు జనవరి నెలకు విడుదలైన సామాజిక పింఛన్ల సొమ్మును బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ఎంపీడీవోల ఖాతాలకు పంపించారు. ఆయా మండలాల అధికారులు నగదును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి గ్రామాల్లో ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు.
నగదు సిద్ధం చేయండి..
2017 జనవరి నుంచి ఎన్టీఆర్ భరోసా పథకంలో పింఛన్లు ట్యాబ్‌ల ద్వారా ఇవ్వనున్న నేపథ్యంలో అవసరమైన నగదు సిద్దం చేయాలని బ్యాంకులకు ఎంపీడీవోలు సమాచారం పంపించారు. ఈ నెల 28వ తేదీకి ఆయా బ్యాంకు శాఖల పరిధిలో అవసరమైన సొమ్మును సిద్ధం చేయాలని ఎంపీడీవోలు వారి పరిధిలోని బ్యాంకులకు సమాచారం అందించారు. దీని ప్రకారం జిల్లాలో ఉన్న 750 బ్యాంకు శాఖల ద్వారా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందజేసే పింఛన్ సొమ్ము రూ.52కోట్లు ఈ నెలాఖరుకు బ్యాంకు అధికారులు సిద్ధం చేయాల్సి ఉంటుంది.
Advertisement