పెన్షన్లు వచ్చేశాయ్..
♦ రూ.37 కోట్లు విడుదల
♦ నేటి నుంచి పంపిణీ
♦ రెండ్రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు
జోగిపేట: మార్చి నెల పెన్షన్ల డబ్బులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పంపిణీ చేసే పెన్షన్లు ఈనెల 29 వరకు పంపిణీ కాలేదు. దీంతో పెన్షన్‌దారులు చాలా ఇబ్బంది పడ్డారు. తాజాగా నిధులు విడుదల కావడంతో సదరు డబ్బును ఆయా ఖాతాదారుల ఖాతాల్లోకి సోమవారం వేసినట్లు డీఆర్‌డీఏ ఏపీఓ (పెన్షన్) విజయలక్ష్మి వెల్లడించారు. నిజానికి ప్రతి నెల మొదటి, రెండు వారాల్లోనే ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేసేది. గ్రామాల్లో లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు, గ్రామ కార్యదర్శులు, పట్టణాల్లో నగర పంచాయతీ కమిషనర్లు, చెర్మైన్ల చుట్టూ గత 20 రోజులుగా తిరుగుతూనే ఉన్నారు. రోజూ పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,36,072 వితంతు, వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లు ఉన్నాయి.
వీరికి బ్యాంకులు, పోస్టాఫీసులు, మాన్యువల్ పద్ధతిన పంపిణీ చేసేవారు. వృద్ధులకు, వితంతువులకు, గీత, చేనేత కార్మికులకు రూ.వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.1500 చొప్పున అందచేస్తున్నారు. లబ్ధిదారులకు ఈ డబ్బులే ప్రధాన ఆదరువు అవుతున్నాయి. పంపిణీలో ఏమాత్రం జాప్యమైనా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై డీఆర్‌డీఏ ఏపీఓ విజయలక్ష్మిని వివరణ కోరగా మార్చి నెల పింఛన్ల సొమ్మును సోమవారం విడుదల చేశామని, ఆయా ఖాతాలకు ఇవి చేరుతాయని చెప్పారు. జిల్లాకు పెన్షన్ల నిమిత్తం ప్రతి నెల రూ.37 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి మంగళ, బుధవారాల్లో పడతాయని, గ్రామాల్లో కూడా పంపిణీ చేస్తారన్నారు.