
జై ఆంధ్రప్రదేశ్ సభకు భారీగా వస్తున్న జనం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర‍్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు జనం భారీగా తరలివస్తున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఆదివారం ఉదయం బహిరంగ సభ వేదిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొంటారు.
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్‌ఆర్ సీపీ పోరాటం కొనసాగుతుందని పార్టీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన సభలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని విస్మరించారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బొత్స చెప్పారు.