తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, కాంగ్రెస్ చేసిన మోసాలు తెలంగాణ ప్రజలకు తెలుసని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, కాంగ్రెస్ చేసిన మోసాలు తెలంగాణ ప్రజలకు తెలుసని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ కేంద్ర నాయకులు దిగ్విజయ్‌సింగ్, మీరాకుమార్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ కోసం తామే 2000 సంవత్సరంలో ఉద్యమాన్ని మొదలు పెట్టామని కాంగ్రెస్ నేతలు చె ప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజలపై ప్రేమతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వలేదని, కేసీఆర్ ఉద్యమ ధాటికి ఇచ్చి తీరాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ మేలిమి బంగారమైతే హైదరాబాద్‌లో ఎందుకు అమ్ముడు పోలేదు. ఇక్కడ నకిలీ అని తేలింది. అందుకే వరంగల్‌లో అమ్మకానికి పెట్టి అక్కడి ప్రజలను మోసం చేస్తారా’ అని సర్వే సత్యనారాయణ అభ్యర్థిత్వంపై కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు.