పోతిరెడ్డిపాడులో చుక్కనీటిని వదిలేది లేదు | Karne Prabhakar Comments On Congress and BJP Leaders | Sakshi
Sakshi News home page

పోతిరెడ్డిపాడులో చుక్కనీటిని వదిలేది లేదు

Published Thu, May 14 2020 2:32 AM | Last Updated on Thu, May 14 2020 2:32 AM

Karne Prabhakar Comments On Congress and BJP Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు అంశంలో కాంగ్రెస్‌ నేతలు రాజకీయ లబ్ధి కోసం గుంట కాడి నక్కల్లా వ్యవహరిస్తున్నారని శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన ఒక్క నీటిచుక్క వదిలేది లేదని, ఉద్యమం సమయం నుంచి పోతిరెడ్డిపాడు అంశంపై టీఆర్‌ఎస్‌ ఒకే వైఖరికి కట్టుబడి ఉందన్నారు.

హంద్రీ నీవాకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నీళ్లు తరలింపునకు అప్పటి మంత్రులుగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు హారతులు ఇచ్చారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ సంకీర్ణంలో ఉన్న తమ పార్టీకి చెందిన ఆరుగురు మంత్రులు రాజీనామా చేసి బయటకు వచ్చారని గుర్తుచేశారు. తెలం గాణ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్‌ నీరటిలా ఉన్నారని, కాంగ్రెస్‌ నేతలు తమ పాలనలో తెలంగాణ ప్రాజెక్టులను పెండిం గ్‌లుగా మార్చారని దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడు అంశంపై తాము చేసే పోరాటంలో కలసిరావడం ద్వారా కాంగ్రెస్‌ నేతలు పాపపరిహారం చేసుకోవాలని హితవు పలికారు. 

బీజేపీ నేతలది భిన్నవైఖరి.. 
పోతిరెడ్డిపాడు అంశంపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం జోక్యం చేసుకునేలా చూడాలని కర్నె సూచించారు. దీనిపై తెలంగాణ, ఏపీ బీజేపీ నేతలు భిన్న వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల జల వివాదాలు ఉండొద్దని కేసీఆర్‌ పెద్ద మనసుతో వ్యవహరించారని, తెలంగాణకు అన్యాయం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.

ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ కూడా గతంలో ఎన్నోమార్లు స్పష్టం చేశారని, ఏపీ నీటి పారుదల శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 29న లేఖ రాసిందన్నారు. ప్రస్తుతమున్న 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు నీటి సామర్థ్యం పెంపు ప్రయత్నాలు మానుకోవాలని లేఖలో ప్రస్తావించినట్టు తెలిపారు. దీనిపై ఏపీ నుంచి స్పందన లేకపోగా, అక్కడి ప్రభుత్వం ఈ నెల 5న జారీ చేసిన ఉత్తర్వులపై కేసీఆర్‌ సమీక్ష జరిపి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసిన విషయాన్ని కర్నె గుర్తు చేశారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 12న మరో లేఖ రాసిందని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement