పత్తిపంటను పరిశీలిస్తున్న కొండా రాఘవరెడ్డి, నాయకులు
-
బతుకమ్మపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు
-
రైతులపై ముఖ్యమంత్రిది కక్షపూరిత ధోరణి
-
నకిలీ విత్తనాల బాధ్యత ప్రభుత్వానిదే..
-
వైఎస్ హయాంలోనే రైతులు ఆనందంగా ఉన్నారు
-
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి
కూసుమంచి: ‘రైతు ఏడ్చిన రాజ్యం..ఎద్దు ఏడ్చిన ఎవుసాయం ముందుకు సాగవు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం రైతాంగం పట్ల కక్షపూరిత ధోరణినితో వ్యవహరిస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. కూసుమంచి సమీపంలోని ఆదివారం ధర్మాతండా వద్ద వర్షాలకు దెబ్బతిన్న పత్తిచేలను ఆయన పరిశీలించారు. గిరిజన రైతులు జర్పుల కృష్ణ, శివతో మాట్లాడారు. పత్తికి పెట్టిన పెట్టుబడి, వచ్చే ఆదాయాన్ని అడిగి తెలసుకున్నారు. ‘ఈ ఏడాది తమ పంటలు బాగాలేవు. కల్తీ విత్తనాలు, వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. పంటలు పోతుంటే ఏ మంత్రి, అధికారి కూడా వచ్చి చూడటం లేదు’ అని వాపోయారు. తెలంగాణ వస్తే తమ కష్టాలు పోతాయనుకున్న రైతులకు కష్టాలే మిగులుతున్నాయని కొండా రాఘవరెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ కాక, రుణాలు ఇవ్వక బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి పెట్టుబడులకు రుణాలు తెచ్చుకునే దుస్థితి వచ్చిందని అన్నారు. ఓ పక్క నకిలీ విత్తనాలు, వర్షాలతో రైతులు నష్టపోతుంటే చలించని ముఖ్యమంత్రి బతుకమ్మలకు మాత్రం కోట్లాది రూపాయలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. నకిలీ విత్తనాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు 10 జిల్లాలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. వారి ఆత్మహత్యలకు ప్రభుత్వ తీరే కారణమని ధ్వజమెత్తారు. రైతులు ఆనందంగా లేకుంటే ఏ ప్రభుత్వం మనుగడ సాగలేదని హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో వ్యవసాయాన్ని పండగ చేయబట్టే ఇన్నాళ్లకీ అయనను రైతులు గుండెల్లో పెట్టుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 50వేలు తక్షణ పరిహారం అందజేయాలని, ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయకపోవటంతో ఇచ్చే అరకొర రుణాలు అప్పు వడ్డీలకే సరిపోతుందన్నారు., వైఎస్ లాగా రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, రైతుల ఇంట పండుగ వచ్చే విధంగా ముఖ్యమంత్రి కృషి చేయాలని కోరారు. రైతులకు వైఎస్సార్‌సీసీ అండగా ఉంటూ ప్రభుత్వంపై పోరాడుతుందని ప్రకటించారు. రాఘవరెడ్డి వెంట పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు బండారు వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జిల్లేపల్లి సైదులు, పాపా వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఆలస్యం సుధాకర్, మందడపు వెంకటేశ్వర్లు, పులి సైదులు, కుర్సం సత్యనారాయణ, కొల్లు వెంకటరెడ్డి, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహాయ కార్యదర్శి బండ్ల సోమిరెడ్డి, ఖమ్మం టౌన్ అద్యక్షులు తుమ్మా అప్పిరెడ్డి, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల అధ్యక్షులు వైవీడీ రెడ్డి, నరికంటి సూర్యానారాయణ మూర్తి, వాలూరి సత్యనారాయణ, ఎండపల్లి వెంకయ్య, మహిళా నాయకురాలు నామెర్ల రేవతి, యూత్ అధ్యక్షులు ఆదూరి రాజవర్దన్‌రెడ్డి ఉన్నారు.