నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ఎదురైంది. పాయకరావుపేట మండలానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు అనితకు వ్యతిరేకంగా ఆదివారం సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు.
అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ.30 వేల చొప్పున, పింఛన్ కావాలని వచ్చేవారి నుంచి రూ.5 వేల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారని మండిపడ్డారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడి పదవిని కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. అనిత వల్లే పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ సర్వనాశనౖమెందన్నారు.ఆమె వచ్చాకే పార్టీలో ఆరు గ్రూపులు తయారయ్యాయని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత, ఆమె అనుచరులు చేసిన అవినీతిని ప్రశ్నించినందుకు తమపై కక్షకట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును తాము కలవడంతో కక్ష గట్టి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలను కూడా అనిత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమె మాటలు విని తమను సస్పెండ్ చేసిన అచ్చెన్నాయుడుపైనా నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాయకరావుపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు, తాపీమేస్త్రీల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు, పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు దేవవరపు ఆనంద్, మాజీ సర్పంచ్‌లు డి.ఆనంద్, కలిగొట్ల శ్రీను, సుంకర సూరిబాబు, గొల్లపల్లి నాగు, తలారి రాజా, భజంత్రీల శివ, చొక్కా శ్రీను, శ్రీనివాసరెడ్డి, కోడూరి నూకరాజు, థామస్, పడాల కోటి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment