కారు చెట్టును ఢీకొని వ్యక్తి మృతి
నరసరావుపేట రూరల్ : కోటప్పకొండ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. రూరల్ పోలీసుల కథనం ప్రకారం... గుంటూరుకు చెందిన బొడ్డపాటి కృష్ణారెడ్డి (32), పలగాని సతీష్ స్నేహితులు. తిరుమల ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న క్రీడలలో పాల్గొనేందుకు వచ్చిన తమ స్నేహితులు కోసం వీరు శనివారం రాత్రి పట్టణానికి వచ్చారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో తమ స్నేహితులకు వసతి కేటాయించిన కోటప్పకొండ కాపు సత్రంలో వదిలిపెట్టేందుకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో చిలకలూరిపేట మేజర్ కాలువ మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కనున్న చెట్టుకు ఢీకొట్టి చిన్నయ మిషన్ ప్రహారీకి తగిలింది. ఈ ప్రమాదంలో కృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడగా, సతీష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కృష్ణారెడ్డిని పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్సై ఏవీ బ్రహ్మం తెలిపారు.