రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
తాడేపల్లిగూడెం రూరల్ : ప్రత్తిపాడు ఫుడ్స్‌ఫ్యాట్స్ వద్ద కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామానికి చెందిన అడపా రామారావు(58), అతని భార్య వరలక్షి్మ(50) పూళ్లలో ఉన్న బంధువులను పలకరించేందుకు సోమవారం ఉదయం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బంధువులకు చెందిన కారులో స్వగ్రామం ఆరుగొలను వెళ్తుం డగా ఫుడ్స్‌ఫ్యాట్స్ సమీపంలో డ్రైవర్ వెంకటకృష్ణకు ఫిట్స్ రావడంతో బ్రేక్‌కు బదులుగా ఎక్స్‌లేటర్‌ను తొక్కాడు. దీంతో కారు వేగంగా చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అడపా రామారావు, అతని భార్య వరలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ వెంకటకృష్ణకు స్వల్పగాయాలు కావడంతో స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పెంటపాడు ఎస్సై సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో పరిశీలించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువులను పలకరించేందుకు వెళ్లి భార్యభర్తలు మృత్యువాత పడడంతో ఆరుగొలను గ్రామం విషాదంలో మునిగింది. ఘటనాస్థలానికి బంధువులు భారీగా తరలిరావడంతో ఫుడ్స్‌ఫ్యాట్స్ వద్ద తణుకు – ఏలూరు రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది.