- అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్‌ఐ స్వాహా చేసిన ‘వెంగమాంబ ఏజెన్సీ’
– రూ.29.50 లక్షలు మింగేసి పరారీ
– వర్సిటీ నోటీసులు పంపినా స్పందించని వైనం
– సెక్యూరిటీ బాండ్లు లేకుండా ఏజెన్సీ నిర్వహణ అప్పగింతపై విమర్శలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఎఫ్, ఈఎస్‌ఐ మొత్తం రూ.29.50 లక్షలు ఏజెన్సీ నిర్వాహకుడు స్వాహా చేశాడు. ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు అందలేదు. దీంతో పెండింగ్ ఉన్న వేతనాలు ఉద్యోగులకు చెల్లిస్తేనే పీఎఫ్, ఈఎస్‌ఐ మొత్తం ఖాతాలో జమ చేస్తామని వర్సిటీ ఉద్యోగులు తేల్చి చెప్పడంతో విషయం బయటపడింది. అయితే ఏజెన్సీ నిర్వాహకుడు పీఎఫ్ మొత్తం కాజేసి పరారీలో ఉన్నాడు. వర్సిటీ యంత్రాంగం ముందుచూపు లేకుండా హడావుడిగా ‘వెంగమాంబ ఏజెన్సీ’కి అప్పగించాలన్న తొందరపాటు నిర్ణయంతో జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
2015 జూలైలో వర్సిటీలో సెక్యూరిటీ గార్డుల నియామకాలు, నిర్వహణను వెంగమాంబ ఏజెన్సీకి అప్పగించారు. సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతను ఎలాంటి టెండర్లు లేకుండా ఏజెన్సీ బాధ్యతను కట్టబెట్టడం మొదలు ఇప్పటి దాకా అంతా వివాదాస్పదమే.నియామకాల్లో భాగంగా ఒక్కో ఉద్యోగితో వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకులు అధికారికంగా రూ.25 వేలు సెక్యూరిటీ బాండ్లు తీసుకున్నారు. తొలుత 60 మంది గార్డులను నియమించారు. ఏజెన్సీకి వర్సిటీ ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.9,500 చెల్లిస్తుండగా ..ఉద్యోగులకు మాత్రం రూ.6,500 ఇస్తున్నారు. జీతాల పంపిణీలో అంతరం ఉన్నప్పటికీ ఉద్యోగులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని వర్సిటీ ఉన్నతాధికారులు తెలిసీతెలియనట్లు వ్యవహరించారు.
మొదటికే మోసం
ప్రతి నెలా ఉద్యోగి నికర జీతాన్ని ఏజెన్సీ నిర్వాహకులకు వర్సిటీ చెల్లిస్తోంది. ఇందులో నుంచి ప్రతి ఉద్యోగి పీఎఫ్, ఈఎస్‌ఐ ఖాతాకు ఏజెన్సీ వారు జమ చేయాలి. ఇంతే మొత్తాన్ని వర్సిటీ కూడా జమ చేస్తుంది. అయితే టెండర్ల ద్వారా నూతన ఏజెన్సీకి అప్పగించాలని గత పాలకమండలిలో నిర్ణయించి.. కొత్త ఏజెన్సీకి అప్పగించేందుకు సిద్ధం చేశారు. దీంతో ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్‌ఐ మొత్తం వెంగమాంబ ఏజెన్సీ చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.29.50 లక్షలు పీఎఫ్, ఈఎస్‌ఐ మొత్తం వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకుడు స్వాహా చేసినట్లు సమాచారం. నాలుగు నెలల జీతం ఉద్యోగులకు అందలేదు. పీఎఫ్ మొత్తం చెల్లించేంతవరకు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేదిలేదని వర్సిటీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కారణం జీతాలు ఏజెన్సీ నిర్వాహకుడు ఖాతాలో జమచేయాల్సి ఉండడమే. ఈ నాలుగు నెలల జీతాలు కూడా ఉద్యోగులకు ఇవ్వరేమోనన్న అనుమానం రావడంతో ఈ మేరకు వర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు నెలలు జీతమైనా ఆయా వ్యక్తిగత జీతాల ఖాతాల్లోనైనా జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
సమష్టి బాధ్యత వహించాలి
ఏజెన్సీ అప్పగించే ముందు సెక్యూరిటీ బాండ్లు తీసుకొని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి .. అనే రీతిలో ఏజెన్సీకి మొత్తం చెల్లించేశాము. మాకు సంబంధం లేదనే రీతిలో వర్సిటీ ఉన్నతాధికారుల వైఖరి కారణంగా ఉద్యోగులకు ఆవేదన కలిగిస్తోంది. రూ.25 వేలు డిపాజిట్, నాలుగు నెలల జీతం, ఏడాదిన్నర నుంచి అందాల్సిన పీఎఫ్ మొత్తం ఉద్యోగులకు దక్కాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వర్సిటీ ఉన్నతాధికారులు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేసి.. ఏజెన్సీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
నోటీసులు పంపాం
పీఎఫ్ మొత్తాలు జమ చేయాలని వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకుడికి నోటీసులు పంపాం. స్పందించకపోవడంతో అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగులకు జీతాలు నిలిపివేశాం.
– డాక్టర్ లక్ష్మీరాం నాయక్, ఫైనాన్స్ ఆఫీసర్, ఎస్కేయూ
పీఎఫ్ మొత్తం స్వాహా!
Published Thu, Jan 19 2017 11:55 PM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM
Advertisement
Advertisement