నాన్నా.. అమ్మను బాగా చూసుకో!
► ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
► తరగతి గదిలో అన్నంలో గుళికలు కలిపి ఆరగించి...
► ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసిన కళాశాల యాజమాన్యం
► అప్పటికే ప్రాణం విడిచి పెట్టిన విద్యార్థిని
‘నాన్నా.. అమ్మను బాగా చూసుకో! తమ్ముడూ అమ్మానాన్నలు ఏడవకుండా చూసుకో.. వాళ్లు ఏడిస్తే నీ చెవులు కత్తిరిస్తా..! టెన్త్‌లో 9.5 ర్యాంకుతో నువ్వు ముందుండాలి. అనూని కూడా బాగా చూసుకో..’ అంటూ బి.ఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. విషపు గుళికలు కలిపిన నీళ్లతో అన్నం కలిపి తిని ప్రాణం తీసుకుంది. కళాశాల తరగతి గదిలోనే జరిగిన ఈ సంఘటన విద్యార్థుల్లో కలకలం రేగింది. వివరాలివీ..
ఎచ్చెర్ల: జాతీయ రహదారికి అనుకుని ఉన్న శ్రీశివానీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో బి. ఫార్మసీ మొదటి ఏడాది చదువు తున్న కిలారి సంతు (19) తరగతి గదిలో శనివారం ఆత్మహత్యకు పాడింది. తల్లిదండ్రులకు పేరిట రాసిన సూసైడ్ నోట్ రాసిన ఆమె, ఆత్మహత్యకు గల కారణాలను మాత్రం పేర్కొనలేదు. స్నేహితులు, పోలీసుల కథనం ప్రకారం.. రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామం వెంకటేశ్వర కాలనీకి చెందిన కిలారి అప్పల నాయుడు, అనసూయల పెద్ద కుమార్తె సంతు. తల్లిదండ్రులది వ్యసాయ నేపథ్యం.
ఆమెకు పదో తరగతి పరీక్షలు రాసిన తమ్ముడు కార్తీక్ ఉన్నారు. సంతు ఉదయం కళాశాలకు వచ్చి, మధ్యాహ్నం లంచ్ అవర్‌లో నీళ్ల సీసాలో విషపు గుళికలు కలిపి, తర్వాత ఆ నీళ్లతో అన్నం కలుపి తినేసింది. కొద్దిసేపటికే బెంచీపై కూర్చొన్న ఆమె స్పృహ కోల్పోయింది. తోటి విద్యార్థులు చెప్పడంతో యాజమాన్యం స్పందించి, అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని శ్రీకాకుళం కి మ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే సంతు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోస్టు మార్టం కోసం రిమ్స్‌కు తరలించారు.
పోలీసుల పరిశీలన
కళాశాల తరగతి గదిని ఎచ్చెర్ల ఎస్సై వి. సందీప్‌కుమార్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. సంతు ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఉన్న విద్యార్థినులను విచారించారు. అనంతం వీఆర్వో గోవిందరావు సమక్షంలో విద్యార్థిని బ్యాగ్ తెరిచి చూడగా, గుళికల పొట్లాం, గుళికలు కలిపిన అన్నం బాక్స్, నీటి బాటిల్ ఉంది. పుస్తకాలు వెతకగా, తెలుగు వెర్షన్‌లో రాసి ఉన్న ఇంగిష్ నోట్ దొరికింది. అయితే ఈ నోట్‌లో ఆత్మహత్యకు కారణం మాత్రం ప్రస్తావించ లేదు.
అమ్మానాన్నల పేరిట లేఖ రాసి, అందులో అమ్మను బాగా చూసుకోవాలని తండ్రిని కోరింది. అమ్మానాన్నలు ఏడవకుండా చూసుకోవాలని, టెన్త్‌లో 9.5 ర్యాంకుతో ముందుండాలని తమ్ముడు కార్తీక్‌ను ఉద్దేశించి పేర్కొంది. మృతురాలి బంధువులు సంతు ఆత్మహత్య చేసుకున్న తరగతి గదిని పరీశీలించారు. ఎస్సై సందీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థిని ఆత్మహత్యకు కారణం ఏమిటన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రతిభగల విద్యార్థిని.. సంతు
సంతుకు కళాశాలలో 90 శాతం హాజరు ఉందని, ప్రతిభ గల విద్యార్థిని అని ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు చెప్పారు. మొదటి సెమిస్టర్‌లో సైతం కళాశాల టాపర్‌గా నిలిచే అవకాశం ఉందని చెప్పారు. ఆమె ఆత్మహత్యకు కారణం తెలియం లేదని, ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను బతికించుకునే ప్రయత్నంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లామని చెప్పారు.
యాజమాన్యానిదే బాధ్యత
శ్రీకాకుళం సిటీ : తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదని మృతురాలి తల్లిదండ్రులు అప్పలనాయుడు, అనసూయలు పేర్కొన్నారు. సంతు మృతి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రిమ్స్‌కు మృతదేహాన్ని తీసుకురాగా, అక్కడ తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్వగ్రామం రణస్థలం మండలం పాతర్లపల్లి నుంచి కోష్టవరకు వచ్చి, అక్కడ 8 గంటలకు కాలేజీ బస్సు ఎక్కింది. మధ్యాహ్నం కళాశాలలో భోజనం అనంతరం సంతు కింద పడిపోయిందని యాజమాన్యం నుంచి సమాచారం వచ్చిందని, మరి కొద్ది సేపటికి అమ్మాయి చనిపోయిందని వారు తెలియజేసినట్లు మృతురాలి తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు.