అడిగినంత ఇస్తేనే ... | phone in programme with Annavaram: Sri Satyanarayana Swamy vari Devastanam EO | Sakshi
Sakshi News home page

అడిగినంత ఇస్తేనే ...

Published Wed, Jun 8 2016 8:41 AM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

డయిల్ టూ ఈవో కార్యక్రమంలో కాలర్ తో మాట్లాడుతున్న ఈవో కె.నాగేశ్వరరావు

డయిల్ టూ ఈవో కార్యక్రమంలో కాలర్ తో మాట్లాడుతున్న ఈవో కె.నాగేశ్వరరావు

  • ‘డయల్ టు అన్నవరం ఈఓ’ కార్యక్రమంలో భక్తుల ఫిర్యాదు
  • తగు చర్యలు తీసుకుంటాం : ఈఓ నాగేశ్వరరావు
  • డయిల్ టూ ఈఓ కార్యక్రమంలో కాలర్‌తో మాట్లాడుతున్న ఈఓ కె.నాగేశ్వరరావు
  •  
    అన్నవరం : సత్యదేవునికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకుందామని వస్తే.. ఇక్కడ తాము అడిగిన మొత్తం ఇస్తేనే గుండు గీస్తామని నాయిబ్రాహ్మణులు అంటున్నారని పలువురు భక్తులు అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకూ నిర్వహించిన ‘డయల్ టు ఈఓ’ కార్యక్రమానికి శ్రీనివాస్ (ఏలేశ్వరం), దూళ్ల సూర్యనారాయణ(కూరాడ), వీరశంకరం(అమలాపురం) ఫోన్ చేసి నాయీబ్రాహ్మణులు రూ.20 ఇస్తే తప్ప గుండు గీయబోమని అంటున్నారని ఫిర్యాదు చేశారు. దీనికి ఈఓ స్పందించి భవిష్యత్‌లో ఇటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఇలా మొత్తం 15 మంది భక్తులు ఈ కార్యక్రమానికి ఫోన్‌చేసి తమ సమస్యలను వివరించారు.
     
    కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు.. ఈఓ స్పందనలు ఇలా..
    కేవీ రఘువరన్, ఇంజరం : అన్నదాన పథ కానికి విరాళాలిచ్చిన దాతలకు వారి పేరున ఎప్పుడు అన్నదానం చేసేది సమాచారం పంపడం లేదు.
    ఈఓ : అన్నదానం దాతలకు సకాలంలోనే  సమాచారం పంపించమని సంబంధిత అధికారులను ఆదేశించాం. ఎక్కడైనా లోపం జరిగితే సరిదిద్ది తగు చర్యలు తీసుకుంటాం.

    సోమేశ్వరరావు, అయినవిల్లిలంక : కోటిపల్లి నుంచి అన్నవరానికి నడిచే దేవస్థానం బస్‌ను నష్టాల కారణంగా రద్దు చేశారు. ఒకవేళ కోటిపల్లి నుంచి విశాఖపట్నానికి ఈ బస్ నడిపితే లాభదాయకంగా ఉండవచ్చేమో పరిశీలించగలరు.
    ఈఓ : అన్ని రకాల ప్రయోగాలు చేశాకే  కోటిపల్లి-అన్నవరం బస్‌ను నిలిపివేశాం.   అన్నవరం నుంచి సింహాచలానికి ఒక బస్ నడుపుతున్నాం.

    మేకల కృష్ణ, శంఖవరం : అన్నవరం దేవస్థానం దత్తత తీసుకున్న శంఖవరంలోని పార్వతీ పరమేశ్వరస్వామి ఆలయంలో నవగ్రహమండపం, ఇతర నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేయాలి.
    ఈఓ : ఇంజినీరింగ్ అధికారులను పంపించి పనులు చేయిస్తాం.
     

    అఖిల, కాకినాడ : దేవస్థానంలోని ఫ్యాన్సీ, కూల్‌డ్రింక్ షాపులలో డ్రింక్స్, సబ్బులు ఎమ్మార్పీ కన్నా ఎక్కువగా విక్రయిస్తున్నారు.  
    ఈఓ : అవి వేలంపాటలో పాడుకున్న షాపులు కావున ఎమ్మార్పీ కన్నా ఒకట్రెండు రూపాయలు ఎక్కువ అమ్ముతారు. అంతకంటే ఎక్కువగా అమ్మితే షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.

    ఉదయ్‌శంకర్, కాకినాడ : బైపాస్ రోడ్‌లోని సత్యదేవుని నమూనా ఆలయంలో సత్యదేవుని విగ్రహాలకు సరైన అలంకరణ చేయడం లేదు.  
    ఈఓ : నమూనా ఆలయంలో సత్యదేవుని విగ్రహానికి వేసేందుకు రోజూ అవసరమైన పూలమాలలు పంపిస్తున్నాం. ఎందుకు దండలు మార్చలేదో తెలుసుకుని చర్యలు తీసుకుంటాం.
    టి.సుబ్బారావు, కడియపులంక : సత్యదేవుని ఆలయానికి ఈశాన్యంలోని సప్తగోకులం సందర్శించే భక్తులను అక్కడి అర్చకులు గోత్రనామాలు చెబుతామని కానుకలు అడుగుతున్నారు.
    ఈఓ : కానుకలు అడగవద్దని అర్చకులను మందలిస్తాం.
     

    ఈర్లు శ్రీనివాస్, అన్నవరం : సత్యదేవుని అంతరాలయం దర్శనం కోసం ఆలయం వద్ద రూ.వంద టికెట్లు అమ్మే వారు భక్తుల నుంచి సొమ్ములు వసూలు చేసి టికెట్లు ఇవ్వడం లేదు.  
    ఈఓ : అటువంటి వారిపై తగు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.

    బత్తుల శ్రీను, రాజమండ్రి : దేవస్థానంలో రైల్వేటైం టేబుల్ లేక  భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రైల్వేస్టేషన్ మూడో ప్లాట్‌ఫాంపై టికెట్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలి.
    ఈఓ : దేవస్థానం ఆవరణలో  రైల్వేటైం టేబుల్ ఏర్పాటు చేస్తాం. రైల్వేస్టేషన్ మూడో ప్లాట్‌ఫాంపై టికెట్లు విక్రయించే విషయమై రైల్వే అధికారులతో మాట్లాడతాం.

    కేవీ రాజు, కాకినాడ : రత్నగిరి టోల్ గేట్ వద్ద రాత్రి ఎనిమిది గంటలకే దేవస్థానం బస్‌లు ఉండడం లేదు.
    ఈఓ : నలుగురు భక్తులున్నా దేవస్థానం బస్‌లను కొండమీదకు నడపాలని ఆదేశించాం. ఒకవేళ బస్ రత్నగిరికి వచ్చి మరలా కిందకు రావడానికి 20 నిమిషాలు సమయం పడుతుంది. ఆ సమయంలో భక్తులు వచ్చి ఉంటే వారికి బస్ కనిపించకపోవచ్చు.  

    లక్ష్మీప్రసన్న, పెద్దాపురం : వ్రతాలాచరించే భక్తుల నుంచి వ్రతపురోహితులు కానుకలు డిమాండ్ చేస్తున్నారు.
    ఈఓ : గతంలో  ఇలాంటి ఆరోపణలు వస్తే కొంతమంది పురోహితులపై చర్యలు తీసుకున్నాం. మరలా పురోహితులను హెచ్చరిస్తాం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement