పైపులు వీక్.. గ్యాస్ లీక్
పైపులు వీక్.. గ్యాస్ లీక్
Published Tue, Jun 6 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
ఒకే చోట ఏడు బావులు
ధర్నాకు దిగిన గ్రామస్తులు
అంతర్వేదికర (సఖినేటిపల్లి) : గ్రామంలోని రక్షణలేని ఓఎన్జీసీ బావులతోను, తుప్పుపట్టిన పైపులైన్లు, పైపుల జాయింట్‌లతోను ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బావులు వద్ద శాశ్వత రక్షణ చర్యలు చేపట్టకపోవడం, తుప్పు పట్టిన జాయింట్‌లను తొలగించకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాల్లో సంస్థ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, అటుపై వీటి గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీగా గ్యాస్ లీకేజీ ..
గ్రామంలోని దిండమెరక, బెల్లంకొండ గ్రూపులకు సమీపంలో మంగళవారం ఉదయం కేవీ 10 బావి నుంచి లీకయిన గ్యాస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇక్కడ ఈ బావితో పాటు మరో ఆరు బావుల్లో ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగిస్తోంది. బావి ముఖ ద్వారం పైపు జాయింట్ నట్‌లు తుప్పు పట్టి ఊడిపోయి, గ్యాస్ బావి వద్ద నుంచి లీకవ్వడం గ్రామస్తులు బెంబేలెత్తి పోయారు. సుమారు 45 నిమిషాల పాటు లీకయిన ఈ గ్యాస్ బావులన్నింటినీ కమ్మేసింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో మోరి గ్యాస్ కలెక‌్షన్ స్టేషన్ సిబ్బంది బావి వద్దకు వచ్చి గ్యాస్ లీకేజీని అరికట్టారు. బావి వద్ద, మోరి జీసీఎస్ వద్ద గొట్టాలను మూసివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ధర్నాకు దిగిన గ్రామస్తులు..
తరుచూ గ్రామంలోని బావులు వద్ద, పొలాల్లోని వెళ్లిన పైపుల నుంచి లీకవుతున్న గ్యాస్ వల్ల తమకు భద్రత లేకుండా పోయిందని గ్రామస్తులు ఏడు బావులున్న ఓఎన్జీసీ సైటులో ధర్నాకు దిగారు. గ్యాస్ లీకేజీలను ముందుగా పసిగట్టే ఆధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, గ్యాస్ లీకేజీల వల్ల దెబ్బతింటున్న పంటలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బెల్లంకొండ నాని, రావి ఆంజనేయులు, చొప్పల బాబూరావు, చెన్నంశెట్టి సుబ్బారావు, బీ వెంకటేశ్వరరావు, బి.రాజు, తోట వెంకటేశ్వర్లు, రావి వాసు, శ్రీను, విష్ణు, బి. పద్మాజీరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement