నకిలీపత్రాలతో వికలాంగుల ఇళ్ల స్థలాలు అమ్మకం
ప్రొద్దుటూరు:
నకిలీపత్రాలు తయారుచేయడంతోపాటు ఏకంగా తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేసి, సీల్ వేసి ఇళ్ల స్థలాలను అమ్మిన సంఘటన వెలుగుచూసింది. బాధితులు మంగళవారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ భాస్కర్‌రెడ్డికి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకోగా ఈ సంఘటనపై పోలీసు కేసు పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. వివరాలిలావున్నాయి. 2013 మార్చి 18న అప్పటి కలెక్టర్ అనిల్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామపంచాయతీలోని అమృతానగర్ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 64లో మొత్తం 144మంది వికలాంగులకు రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు పంపిణీ చేశారు. అయితే వీటిలో 29మంది ఇళ్ల స్థలాలు కబ్జాకు గురయ్యాయని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు అనేకమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేశారు. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పందన లేదు. ఇటీవల వీరు కొత్తగా వచ్చిన కలెక్టర్ సత్యనారాయణను కలిసి సమస్యను విన్నవించారు. ఆయన తహసీల్దార్ భాస్కర్‌రెడ్డిని ఆదేశించగా ఆమేరకు గత మూడు రోజులుగా ఆర్‌ఐ రామకృష్ణారెడ్డి, వీఆర్‌ఓ గోపాల్‌రెడ్డి, సర్వేయర్ గురివిరెడ్డిలు కలిసి పరిశీలించారు. కాగా నకిలీపత్రాలతో స్థలాలను కొనుగోలు చేసిన వారు ఏకంగా పునాదులు నిర్మించడంతోపాటు వీటిపై తమ పేరు, సెల్ నంబర్ కూడా రాసుకున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఆ మేరకు స్థలాలు కొనుగోలు చేసిన వారిని మంగళవారం సాయంత్రం తహసీల్దార్ భాస్కర్‌రెడ్డి వద్ద హాజరుపరిచారు. దేవాంగపేటకు చెందిన మచ్చా సంజమ్మ, మచ్చా స్వర్ణ, పిట్టా సంజమ్మ, నాగభూషణంతోపాటు సుమారు 20 మంది ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. వీరు 728, 729, 731, 732, 727, 767, 722, 764, 765, 763, 758, 760, 761, 730, 766, 725, 759, 757 ప్లాట్లను కొనుగోలు చేశారు. కాగా తొలిమారు వీరు మాత్రమే వచ్చారని, రేపు, ఎల్లుండి ఇంకా ఎక్కువమంది బాధితులు తమను ఆశ్రయించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు స్వయంగా అనడం గమనార్హం.
ముగ్గురు వ్యక్తులచేత స్థలాలు కొన్నాం
అధికారపార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ వన్నేసు, మేస్త్రీ బి.శ్రీను, ఉలసాల సత్యనారాయణల ద్వారా తాము స్థలాలు కొనుగోలు చేసినట్లు వీరు తహసీల్దార్‌కు చెప్పారు. తమలో కొంతమంది రెండు సెంట్ల స్థలాన్ని రూ.35వేల వరకు పెట్టి కొనుగోలు చేయగా, మరికొందరు పునాదులతో సహా కలిపి రూ.లక్ష వరకు చెల్లించామన్నారు. ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో ఈ విధంగా చేశామని, తమ పొరపాటును క్షమించాలని కోరారు. కాగా ఇందుకు కారణమైన ఈ ముగ్గురిపై కఠినచర్యలు తీసుకోవాలని వారు లిఖిత పూర్వకంగా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ప్రకారం సుమారు రూ.20 లక్షల వరకు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని, వారు విచారణ చేసి కేసు నమోదు చేస్తారని తహసీల్దార్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ వన్నేసు సాక్షితో మాట్లాడుతూ ఆ స్థలాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా తనపై బురద చల్లిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తానని తెలిపారు.
తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ
ముఠాగా ఏర్పడిన వ్యక్తులు నకిలీ పత్రాలు తయారు చేసి స్థలాలను అమ్ముకున్నారు. పైగా ఈ పత్రాల్లో తహసీల్దార్ సంతకాలతోపాటు సీల్ కూడా వేశారు. 2007లో అప్పటి తహసీల్దార్ వినాయకం పేరుతో ఫోర్జరీ సంతకాలు చేశారు. ఈయన ప్రస్తుతం జమ్మలమడుగు ఆర్డీఓగా ఉన్నారు.