froad
-
ఉచితశిక్షణ పేరిట మోసం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉచిత కుట్టు శిక్షణ పేరుతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఘరాన మోసానికి పాల్పడ్డాడు. రెండునెలల శిక్షణ పేరుతో మహిళల నుంచి రూ.1550 చొప్పున వసూలు చేశాడు. అనంతరం నకిలీ సర్టి ఫికెట్లు అంటగడుతున్నట్లు బయటపడడంతో బాధితులు ఆదివారం లబోదిబోమన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాలసంక్షేమ సంఘంలో మూడు నెలలక్రితం టీఆర్ఎస్ అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి, మాల మహిళా సంఘం అధ్యక్షురాలు బెల్లం శ్రీలతతో కుట్టుశిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభ దశలో ప్రభుత్వ గుర్తింపు పొందిన కుట్టు సర్టిఫికెట్తో పాటు ఉచితంగా కుట్టుశిక్షణ రెండు నెలలపాటు ఇచ్చి కుట్టుమిషన్‌ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని మాయమాటలు చెప్పాడు. ఇది నమ్మిన 550 మంది మహిళలు రెండు నెలల నుంచి కుట్టు శిక్షణ పొందారు. కొంతమంది హాజరు కాలేదు. కుట్టు శిక్షణ నేర్చుకున్నవారు తమకు కుట్టుమిషన్ ఇప్పించాలని కోరారు. దీంతో అసలు విషయం బయటపడింది. 550 మంది వద్ద రూ.1550 చొప్పున రూ.8.60 లక్షలు వసూలు చేసి, మాల మహిళా సంఘం పేరుతో ఉన్న సర్టిఫికెట్లు జారీ చేశారు. అనుమానం వచ్చిన మహిళలు దీనిపై నిలదీశారు. బెల్లం శ్రీలత సర్టిఫికెట్ల విషయంతో మాట మార్చగా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో రంగప్రవేశంచేసి శ్రీలతతో పాటు అందుకు కారకులైన వారిని అందుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, గంభీరావుపేట మండలంలో కూడా అనేక మంది దీంట్లో మోసపోయారని తేలింది. సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ సంఘటనపై విచారణ చేస్తున్నారు. బాధ్యులపై కేసునమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
డిపాజిట్లు మాయం
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల) : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం లోని అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.10 కోట్ల వరకు డిపాజిట్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైన సొమ్ము మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు ఖాతాదారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. డిపాజిట్లు లేవన్న సమాచారంతో దాదాపు 40 మంది ఖాతాదారులు బుధవారం బ్యాంకు వద్ద గుమిగూడారు. దీనిపై ఫిర్యాదులు ఇవ్వాలని, వాటిని పరిశీలిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు రూ.2కోట్ల వరకు డిపాజిట్ల ఫిర్యాదులు వచ్చినట్లు బ్యాంకు అ«ధికారి మధుసూదన్ తెలిపారు. ఖాతాదారులు వచ్చి తమ ఖాతాలో ఉన్న నగదును ఒక్కొక్కరిగా పరిశీలించుకుంటున్నారని, ఇప్పటి వరకు ఎంత నగదు మాయమైందో స్పష్టంగా చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. కుప్పకూలిన ఖాతాదారుడు.. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులు లేవని తెలియడంతో నాగిరెడ్డిగూడ గ్రామానికి చెందిన డిపాజిట్‌దారుడు కృష్ణయాదవ్ ఒక్కసారిగా కుప్పకూలాడు. బ్యాంకు వద్దకు చేరుకుని బోరున విలపించాడు. తన అవసరాల నిమిత్తం రూ.కోటి పది లక్షలు నాలుగు బాండ్ల రూపంలో బ్యాంకులో డిపాజిట్ చేశానని, బ్యాంకులో ఇంత మోసం జరుగుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పరంగా ఏ విధమైన చర్యలూ తీసుకోవడం లేదని ఖాతాదారులు వాపోయారు. కాగా, గోల్‌మాల్‌కు బాధ్యుడిగా భావిస్తున్న బ్యాంకు క్యాషియర్ జైపాల్‌రెడ్డి బుధవారం రాత్రి పోలీసులకు లొంగిపోయాడు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ జరుగుతోంది: మధుసూదన్, పరిశీలకుడు అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల్లో డబ్బులు మాయమైన విషయంపై పరిశీలన చేస్తున్నాం. బ్యాంకులో ఇంతకు ముందు పనిచేసిన శ్రీనివాస్‌రావుతో పాటు ప్రస్తుతం ఉన్న మేనేజర్ రాజన్న ద్వారా ఖాతాదారుల పాస్‌బుక్‌లను తీసుకుని ఆన్లైన్ ద్వారా పరిశీలిస్తున్నాం. డబ్బు మాయమైన వారి వివరాలు సేకరిస్తున్నాం -
ఐపీ..కుచ్చుటోపీ..!
రూ.4.54 కోట్లకు వ్యాపారి టోకరా 158మంది రైతుల కంట్లో ‘మిర్చి’ కొట్టిన దివాలా ఏన్కూరు{ ఆరుగాలం శ్రమించి..చెమటోడ్చి పండించిన పంటను వ్యాపారి చేతిలో పెడితే..రావాల్సిన డబ్బును ఇగిస్తా..అగిస్తా.. అంటూ చివరకు రైతుల కంట్లో ‘మిర్చి’ కొట్టిండో వ్యాపారి. సన్న, చిన్నకారు రైతులెందరో అమ్మిన మిరప దిగుబడి డబ్బులొస్తాయని ఆశగా చూస్తుంటే..దివాలా పిటీషన్ వేయడంతో గుండెపగిలినంత పనై..రోదిస్తున్నారు. కొందరికి రూ.వేలు, ఇంకొందరికి రూ.లక్షలు ఇలా..158మంది రైతులకు అక్షరాలా..రూ.4 కోట్లకు పైగా ముట్టజెప్పాల్సి ఉండగా..ఐపీ..పేరిట కుచ్చుటోపీ పెట్టాడని ఆవేదన చెందుతున్నారు. ఇక తమ పరిస్థేతేం కావాలని కర్షకులు ఆక్రోశిస్తూ..అధికారులే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 158మంది బాధిత రైతులు.. రావాల్సింది కోట్ల రూపాయలు.. ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన ఇంజం గోవర్దన్ అనే వ్యాపారి రైతుల నుంచి మిరప పంటను కొనుగోలు చేసి..వారికి డబ్బు చెల్లించకుండా జాప్యం చేస్తూ చివరకు వ్యాపారంలో నష్టపోయానని పేర్కొంటూ దివాలా పిటీషన్ (ఐపీ) వేశాడు. ఇతను ఏన్కూరు మండలంలోని రేపల్లెవాడ, కేసుపల్లి, హిమామ్‌నగర్, టీఎల్.పేట, అక్కినాపురంతండా, రామాతండా, భద్రుతండా, భగవాన్‌నాయక్‌తండా, తదితర గ్రామాల్లో రైతుల నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో మిరపకాయలను కొనుగోలు చేశాడు. మొత్తం 158 మంది రైతుల వద్ద నుంచి సరుకు కొనగా..ఇందుకు సంబంధించిన చెల్లింపులు జరగలేదు. ఒక్కో రైతుకు రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు అందజేయాల్సి ఉంది. ఒక్క రేపల్లెవాడ గ్రామానికి చెందిన 46 మంది రైతులకే సుమారు రూ.65 లక్షలు రావాల్సి ఉంది. ఇంకా..సన్న, చిన్నకారు రైతులకు కూడా ఒక్కోక్కరికి వేలల్లో డబ్బు ఆగింది. రేపు రా..మాపు రా.. చివరకు ముంచెరా..! పంట డబ్బుకోసం సదరు వ్యాపారి ఇంటి చుట్టూ తిరగలేక అవస్థ పడ్డామని, ఎప్పుడు వెళ్లినా..రేపిస్తా..మాపిస్తా..అంటూ తిప్పి తిప్పలు పెట్టాడని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా 5, 15, 25వ తేదీన డబ్బులిస్తానని మాయమాటలు చెప్పి కాలం వెల్లబుచ్చాడని అంటున్నారు. ఇంటికి పోతే అక్కడా ఉండడని, భార్యను అడిగితే ఎక్కడికి వెళ్లిండో తెలియదని చెప్పేదని, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చేదని..కష్టపడి పంట పండించి అమ్మితే..ఈ గోసేందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారిపై ఫిర్యాదులు.. ఆదుకోవాలని విన్నపాలు.. – ఐపీ పెట్టిన వ్యాపారి ఇంజం గోవర్దన్‌పై చర్యలు తీసుకోవాలని ఏన్కూరు పోలీస్ స్టేషన్లో బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. – కేసు నమోదు చేసినట్లు ఎస్సై తోట నాగరాజు తెలిపారు. – తమకు రావాల్సిన డబ్బును చెల్లించేలా చూడాలని ఇన్చార్జ్ తహసీల్దార్ నాగరాజును రైతులు వేడుకున్నారు. – అనంతరం బాధిత రైతులు కలెక్టర్‌ను కలిసేందుకు లారీలో ఖమ్మం వెళ్లారు. నమ్మించి ముంచిండు.. మూడెకరాల్లో మిర్చి వేసి..వ్యాపారి గోవర్దన్‌కు అమ్మినా. 26 క్వింటాళ్ల మిర్చికి రూ.3 లక్షలకు పైగా రావాల్సి ఉంది. ఆరు నెలల నుంచి తిప్పుకొని..ఇప్పుడు ఐపీ పెట్టిండు. – కె.నరసింహారావు, బాధిత రైతు, రేపల్లెవాడ. ఆ వ్యాపారిని శిక్షించాలి.. రైతులను మోసి చేసి ఐపీ దాఖలు చేసిన వ్యాపారిని కఠినంగా శిక్షించాలి. నాకు రూ.2.50 లక్షలు ఇవ్వాల్సి ఉంని. ఆ డబ్బు చెల్లించాలి. నాకు న్యాయం జరిగేలా చూడాలి. –ఎస్కె.ఖాసీంసాహెబ్, బాధిత రైతు, టీఎల్.పేట -
నకిలీపత్రాలతో వికలాంగుల ఇళ్ల స్థలాలు అమ్మకం
ప్రొద్దుటూరు: నకిలీపత్రాలు తయారుచేయడంతోపాటు ఏకంగా తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేసి, సీల్ వేసి ఇళ్ల స్థలాలను అమ్మిన సంఘటన వెలుగుచూసింది. బాధితులు మంగళవారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ భాస్కర్‌రెడ్డికి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకోగా ఈ సంఘటనపై పోలీసు కేసు పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. వివరాలిలావున్నాయి. 2013 మార్చి 18న అప్పటి కలెక్టర్ అనిల్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామపంచాయతీలోని అమృతానగర్ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 64లో మొత్తం 144మంది వికలాంగులకు రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు పంపిణీ చేశారు. అయితే వీటిలో 29మంది ఇళ్ల స్థలాలు కబ్జాకు గురయ్యాయని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు అనేకమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేశారు. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పందన లేదు. ఇటీవల వీరు కొత్తగా వచ్చిన కలెక్టర్ సత్యనారాయణను కలిసి సమస్యను విన్నవించారు. ఆయన తహసీల్దార్ భాస్కర్‌రెడ్డిని ఆదేశించగా ఆమేరకు గత మూడు రోజులుగా ఆర్ఐ రామకృష్ణారెడ్డి, వీఆర్ఓ గోపాల్‌రెడ్డి, సర్వేయర్ గురివిరెడ్డిలు కలిసి పరిశీలించారు. కాగా నకిలీపత్రాలతో స్థలాలను కొనుగోలు చేసిన వారు ఏకంగా పునాదులు నిర్మించడంతోపాటు వీటిపై తమ పేరు, సెల్ నంబర్ కూడా రాసుకున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఆ మేరకు స్థలాలు కొనుగోలు చేసిన వారిని మంగళవారం సాయంత్రం తహసీల్దార్ భాస్కర్‌రెడ్డి వద్ద హాజరుపరిచారు. దేవాంగపేటకు చెందిన మచ్చా సంజమ్మ, మచ్చా స్వర్ణ, పిట్టా సంజమ్మ, నాగభూషణంతోపాటు సుమారు 20 మంది ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. వీరు 728, 729, 731, 732, 727, 767, 722, 764, 765, 763, 758, 760, 761, 730, 766, 725, 759, 757 ప్లాట్లను కొనుగోలు చేశారు. కాగా తొలిమారు వీరు మాత్రమే వచ్చారని, రేపు, ఎల్లుండి ఇంకా ఎక్కువమంది బాధితులు తమను ఆశ్రయించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు స్వయంగా అనడం గమనార్హం. ముగ్గురు వ్యక్తులచేత స్థలాలు కొన్నాం అధికారపార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ వన్నేసు, మేస్త్రీ బి.శ్రీను, ఉలసాల సత్యనారాయణల ద్వారా తాము స్థలాలు కొనుగోలు చేసినట్లు వీరు తహసీల్దార్‌కు చెప్పారు. తమలో కొంతమంది రెండు సెంట్ల స్థలాన్ని రూ.35వేల వరకు పెట్టి కొనుగోలు చేయగా, మరికొందరు పునాదులతో సహా కలిపి రూ.లక్ష వరకు చెల్లించామన్నారు. ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో ఈ విధంగా చేశామని, తమ పొరపాటును క్షమించాలని కోరారు. కాగా ఇందుకు కారణమైన ఈ ముగ్గురిపై కఠినచర్యలు తీసుకోవాలని వారు లిఖిత పూర్వకంగా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ప్రకారం సుమారు రూ.20 లక్షల వరకు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని, వారు విచారణ చేసి కేసు నమోదు చేస్తారని తహసీల్దార్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ వన్నేసు సాక్షితో మాట్లాడుతూ ఆ స్థలాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా తనపై బురద చల్లిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తానని తెలిపారు. తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ ముఠాగా ఏర్పడిన వ్యక్తులు నకిలీ పత్రాలు తయారు చేసి స్థలాలను అమ్ముకున్నారు. పైగా ఈ పత్రాల్లో తహసీల్దార్ సంతకాలతోపాటు సీల్ కూడా వేశారు. 2007లో అప్పటి తహసీల్దార్ వినాయకం పేరుతో ఫోర్జరీ సంతకాలు చేశారు. ఈయన ప్రస్తుతం జమ్మలమడుగు ఆర్డీఓగా ఉన్నారు. -
రెండు వేల మంది నిరుద్యోగులకు టోకరా!
హైదరాబాద్: ఉద్యోగాల పేరిట సుమారు 2 వేల మంది నిరుద్యోగులను మోసం చేసిన ఇద్దరిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలిం చారు. ఇన్స్పెక్టర్ బద్దం నవీన్‌రెడ్డి కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామానికి చెందిన షేక్ జానీ అలియాస్ సందీప్(23) డిగ్రీ చదువుకున్నాడు. 2013లో నగరానికి వచ్చి చందానగర్‌లోని ఓ ఆఫీసులో బాయ్‌గా చేరాడు. అక్కడే పని చేస్తున్న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం చేవులపల్లి గ్రామానికి చెందిన కోనగాని అనిల్ అలియాస్ పోచయ్య(24)తో ఇతనికి స్నేహం ఏర్పడింది. కష్టపడకుండా డబ్బు సంపాదించేందుకు ఇద్దరూ పథకం వేసి మల్కాజిగిరికి చెందిన స్వాతి, శ్రీజ, వైష్ణవిలను తమ వద్ద ఉద్యోగులుగా పెట్టుకున్నారు. అంతా ముఠాగా ఏర్పడి తమ పేర్లపై బ్యాంక్‌లో ఖాతాలు తెరిచారు. బిస్కెట్, కూల్ డ్రింక్ కంపెనీల్లో సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయని, రూ.18 వేల నుంచి రూ. 25 వేల వరకు జీతం ఇప్పిస్తామని పత్రికలో ప్రకటనలు ఇచ్చేవారు. యాడ్ చూసి ఎవరైన ఫోన్ చేస్తే అప్లికేషన్ ఫీజు కింద రూ. 1000లు బ్యాంక్‌లో జమ చేయించుకోవడంతో పాటు అడ్రస్సు ప్రూఫ్‌లు, ఈ మెయిల్స్ ఐడీలు తీసుకునే వారు. అప్లికేషన్ ఫీజు కింద నిరుద్యోగులు బ్యాంక్‌లో వేసిన రూ.1000లను వీరు వెంటనే ఏటీఎం నుంచి డ్రా చేసుకొని, తమ ఫోన్ సిమ్ కార్డులు మార్చేసేవారు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం మంగమ్మగూడెం చెందిన మల్లేష్ ఉద్యోగాల పేరిట తనను మోసం చేశారంటూ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈనెల 9న మేడిపల్లి పోలీసులు బోడుప్పల్ ఎస్ఆర్ కాలేజీ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా షేక్ జానీ, అనిల్‌లు బైక్‌పై వెళ్తూ పట్టుబడ్డారు. మరో ముగ్గురు యువతులతో కలిసి తాము సుమారు 2 వేల మంది నిరుద్యోగుల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి జల్సాలు చేశామని వెల్లడించారు. నిందితులు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, జానీ, అనిల్‌ను రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 12 సెల్ఫోన్లు, ఉపయోగించని 30 సిమ్ కార్డులు, ఉపయోగించిన 32 సిమ్ కార్డులు, 12 డెబిట్ కార్డులు, 8 పాన్‌కార్డులు, 18 ఓటర్ ఐడీ కార్డులు, 9 చెక్కు బుక్స్, వివిధ వ్యక్తులకు చెందిన 8 ఫొటోలు, బ్యాంక్ పాస్‌బుక్స్ 12, బైక్, కంప్యూటర్, రూ. 11 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
ప్రైవేట్ వైద్యుల మరో ఘరానా మోసం!
హైదరాబాద్: ప్రైవేట్ వైద్యుల ఘరానా మోసాలు రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. అనారోగ్యం కారణంగా ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించిన వృద్ధ దంపతులు మోసపోయిన ఘటన నగరంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధ జంట వద్ద ఆరోగ్య సమస్యలతో ఎల్బీ నగర్ లోని ప్రైవేట్ డాక్టర్లను ఆశ్రయిస్తే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని మాయ మాటలు చెప్పారు. దీనిలో భాగంగానే వారి వద్ద నుంచి రూ.15 లక్షలు వసూలు చేశారు. అయితే దీనిపై మోసపోయామని గ్రహించిన ఆ దంపతులు పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసానికి పాల్పడిన డాక్టర్లు రాంజీ, నాగభూషణంలుగా తెలుస్తోంది. -
వికటించిన ఫేస్బుక్ ప్రేమ
హైదరాబాద్: ఫేస్బుక్ పరిచయం ప్రేమకు దారి తీసింది. అంతేకాదు పెళ్లి దాకా వచ్చింది.. నిశ్చితార్థం పూర్తి అయ్యాక వరుడు సహజీవనం చేద్దామని ప్రతిపాదించాడు. ఇందుకు ఆమె కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే గర్భం దాల్చిన ఆమెకు వరుడి తల్లి, సోదరి గర్భస్రావం చేయించారు. ఈనెల 7న పెళ్లి జరగాల్సి ఉండగా ఆ ప్రబుద్ధుడు ముఖం చాటేసి తనకు వేరొక యువతితో పెళ్లి కుదిరిందని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలు న్యాయం చేయాలంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం... చండీగఢ్‌కు చెందిన యువతి(32)తో బంజారాహిల్స్ రోడ్‌నెం. 2లోని ఇందిరానగర్‌లో నివసించే చిన్నం కిరణ్‌బాబు(32) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫేస్బుక్లో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో జులై 5న బెంగళూరులోని ఓ హోటల్లో నిశ్చితార్థం జరిగింది. అనంతరం పెళ్లయ్యే దాకా సహజీవనం చేద్దామని ప్రతిపాదించి మకాం బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌కు మార్చాడు. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భం దాల్చగా.. కిరణ్ తల్లి రోజా, అతని సోదరి కల్పన గర్భస్రావం చేయించారు. అనారోగ్యానికి గురి కావడంతో ఆమె అక్టోబర్ 28న తన పుట్టింటికి వెళ్లింది. ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 7న పెళ్లి జరగాల్సి ఉండగా కొంత కాలంగా కిరణ్‌బాబు ముఖం చాటేశాడు. ఫోన్లో కూడా ఆమెకు అందుబాటులోకి రాలేదు. కిరణ్ తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా ముఖం చాటేశారు. ఆందోళనకు గురైన ఆ యువతి ఈనెల 2న ఇందిరానగర్‌కు వచ్చి కాబోయే భర్తలను పెళ్లి గురించి నిలదీసింది. దీంతో అతని తల్లిదండ్రులు ‘కిరణ్‌కు వేరే అమ్మాయితో పెళ్లి కుదిరింది. రూ. 2 కోట్ల కట్నం ఇస్తున్నారు. నీతో పెళ్లి జరగదు’ అని తేగేసి చెప్పారు. ఆమె ఎంత బతిమిలాడినా వినిపించుకోలేదు. మూడు రోజుల పాటు అక్కడే ఉండగా తీవ్రంగా కొట్టారు. ముక్కు, కన్ను దెబ్బతిన్నాయి. ఆ తర్వాత కిరణ్ కుటుంబ సభ్యులంతా పరారయ్యారు. తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించగా.. నిందితులపై ఐపీసీ సెక్షన్ 313, 323, 420, 376, 379, 506ల కింద కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.