బ్యాంకు ఎదుట గుమిగూడిన ఖాతాదారులు
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల) : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం లోని అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.10 కోట్ల వరకు డిపాజిట్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైన సొమ్ము మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు ఖాతాదారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. డిపాజిట్లు లేవన్న సమాచారంతో దాదాపు 40 మంది ఖాతాదారులు బుధవారం బ్యాంకు వద్ద గుమిగూడారు. దీనిపై ఫిర్యాదులు ఇవ్వాలని, వాటిని పరిశీలిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు రూ.2కోట్ల వరకు డిపాజిట్ల ఫిర్యాదులు వచ్చినట్లు బ్యాంకు అ«ధికారి మధుసూదన్ తెలిపారు. ఖాతాదారులు వచ్చి తమ ఖాతాలో ఉన్న నగదును ఒక్కొక్కరిగా పరిశీలించుకుంటున్నారని, ఇప్పటి వరకు ఎంత నగదు మాయమైందో స్పష్టంగా చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు.
కుప్పకూలిన ఖాతాదారుడు..
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులు లేవని తెలియడంతో నాగిరెడ్డిగూడ గ్రామానికి చెందిన డిపాజిట్‌దారుడు కృష్ణయాదవ్ ఒక్కసారిగా కుప్పకూలాడు. బ్యాంకు వద్దకు చేరుకుని బోరున విలపించాడు. తన అవసరాల నిమిత్తం రూ.కోటి పది లక్షలు నాలుగు బాండ్ల రూపంలో బ్యాంకులో డిపాజిట్ చేశానని, బ్యాంకులో ఇంత మోసం జరుగుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పరంగా ఏ విధమైన చర్యలూ తీసుకోవడం లేదని ఖాతాదారులు వాపోయారు. కాగా, గోల్‌మాల్‌కు బాధ్యుడిగా భావిస్తున్న బ్యాంకు క్యాషియర్ జైపాల్‌రెడ్డి బుధవారం రాత్రి పోలీసులకు లొంగిపోయాడు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.
విచారణ జరుగుతోంది: మధుసూదన్, పరిశీలకుడు
అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల్లో డబ్బులు మాయమైన విషయంపై పరిశీలన చేస్తున్నాం. బ్యాంకులో ఇంతకు ముందు పనిచేసిన శ్రీనివాస్‌రావుతో పాటు ప్రస్తుతం ఉన్న మేనేజర్ రాజన్న ద్వారా ఖాతాదారుల పాస్‌బుక్‌లను తీసుకుని ఆన్‌లైన్ ద్వారా పరిశీలిస్తున్నాం. డబ్బు మాయమైన వారి వివరాలు సేకరిస్తున్నాం
Comments
Please login to add a commentAdd a comment