హైదరాబాద్: ఫేస్‌బుక్ పరిచయం ప్రేమకు దారి తీసింది. అంతేకాదు పెళ్లి దాకా వచ్చింది.. నిశ్చితార్థం పూర్తి అయ్యాక వరుడు సహజీవనం చేద్దామని ప్రతిపాదించాడు. ఇందుకు ఆమె కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే గర్భం దాల్చిన ఆమెకు వరుడి తల్లి, సోదరి గర్భస్రావం చేయించారు. ఈనెల 7న పెళ్లి జరగాల్సి ఉండగా ఆ ప్రబుద్ధుడు ముఖం చాటేసి తనకు వేరొక యువతితో పెళ్లి కుదిరిందని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలు న్యాయం చేయాలంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం... చండీగఢ్‌కు చెందిన యువతి(32)తో బంజారాహిల్స్ రోడ్‌నెం. 2లోని ఇందిరానగర్‌లో నివసించే చిన్నం కిరణ్‌బాబు(32) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో జులై 5న బెంగళూరులోని ఓ హోటల్‌లో నిశ్చితార్థం జరిగింది.
అనంతరం పెళ్లయ్యే దాకా సహజీవనం చేద్దామని ప్రతిపాదించి మకాం బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌కు మార్చాడు. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భం దాల్చగా.. కిరణ్ తల్లి రోజా, అతని సోదరి కల్పన గర్భస్రావం చేయించారు. అనారోగ్యానికి గురి కావడంతో ఆమె అక్టోబర్ 28న తన పుట్టింటికి వెళ్లింది. ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 7న పెళ్లి జరగాల్సి ఉండగా కొంత కాలంగా కిరణ్‌బాబు ముఖం చాటేశాడు. ఫోన్‌లో కూడా ఆమెకు అందుబాటులోకి రాలేదు. కిరణ్ తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా ముఖం చాటేశారు. ఆందోళనకు గురైన ఆ యువతి ఈనెల 2న ఇందిరానగర్‌కు వచ్చి కాబోయే భర్తలను పెళ్లి గురించి నిలదీసింది. దీంతో అతని తల్లిదండ్రులు ‘కిరణ్‌కు వేరే అమ్మాయితో పెళ్లి కుదిరింది. రూ. 2 కోట్ల కట్నం ఇస్తున్నారు. నీతో పెళ్లి జరగదు’ అని తేగేసి చెప్పారు. ఆమె ఎంత బతిమిలాడినా వినిపించుకోలేదు. మూడు రోజుల పాటు అక్కడే ఉండగా తీవ్రంగా కొట్టారు. ముక్కు, కన్ను దెబ్బతిన్నాయి. ఆ తర్వాత కిరణ్ కుటుంబ సభ్యులంతా పరారయ్యారు. తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించగా.. నిందితులపై ఐపీసీ సెక్షన్ 313, 323, 420, 376, 379, 506ల కింద కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.