రెండు వేల మంది నిరుద్యోగులకు టోకరా!
హైదరాబాద్: ఉద్యోగాల పేరిట సుమారు 2 వేల మంది నిరుద్యోగులను మోసం చేసిన ఇద్దరిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలిం చారు. ఇన్‌స్పెక్టర్ బద్దం నవీన్‌రెడ్డి కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామానికి చెందిన షేక్ జానీ అలియాస్ సందీప్(23) డిగ్రీ చదువుకున్నాడు. 2013లో నగరానికి వచ్చి చందానగర్‌లోని ఓ ఆఫీసులో బాయ్‌గా చేరాడు. అక్కడే పని చేస్తున్న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం చేవులపల్లి గ్రామానికి చెందిన కోనగాని అనిల్ అలియాస్ పోచయ్య(24)తో ఇతనికి స్నేహం ఏర్పడింది. కష్టపడకుండా డబ్బు సంపాదించేందుకు ఇద్దరూ పథకం వేసి మల్కాజిగిరికి చెందిన స్వాతి, శ్రీజ, వైష్ణవిలను తమ వద్ద ఉద్యోగులుగా పెట్టుకున్నారు. అంతా ముఠాగా ఏర్పడి తమ పేర్లపై బ్యాంక్‌లో ఖాతాలు తెరిచారు. బిస్కెట్, కూల్ డ్రింక్ కంపెనీల్లో సూపర్‌వైజర్ ఉద్యోగాలు ఉన్నాయని, రూ.18 వేల నుంచి రూ. 25 వేల వరకు జీతం ఇప్పిస్తామని పత్రికలో ప్రకటనలు ఇచ్చేవారు. యాడ్ చూసి ఎవరైన ఫోన్ చేస్తే అప్లికేషన్ ఫీజు కింద రూ. 1000లు బ్యాంక్‌లో జమ చేయించుకోవడంతో పాటు అడ్రస్సు ప్రూఫ్‌లు, ఈ మెయిల్స్ ఐడీలు తీసుకునే వారు.
అప్లికేషన్ ఫీజు కింద నిరుద్యోగులు బ్యాంక్‌లో వేసిన రూ.1000లను వీరు వెంటనే ఏటీఎం నుంచి డ్రా చేసుకొని, తమ ఫోన్ సిమ్ కార్డులు మార్చేసేవారు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం మంగమ్మగూడెం చెందిన మల్లేష్ ఉద్యోగాల పేరిట తనను మోసం చేశారంటూ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈనెల 9న మేడిపల్లి పోలీసులు బోడుప్పల్ ఎస్‌ఆర్ కాలేజీ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా షేక్ జానీ, అనిల్‌లు బైక్‌పై వెళ్తూ పట్టుబడ్డారు. మరో ముగ్గురు యువతులతో కలిసి తాము సుమారు 2 వేల మంది నిరుద్యోగుల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి జల్సాలు చేశామని వెల్లడించారు. నిందితులు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, జానీ, అనిల్‌ను రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 12 సెల్‌ఫోన్లు, ఉపయోగించని 30 సిమ్ కార్డులు, ఉపయోగించిన 32 సిమ్ కార్డులు, 12 డెబిట్ కార్డులు, 8 పాన్‌కార్డులు, 18 ఓటర్ ఐడీ కార్డులు, 9 చెక్కు బుక్స్, వివిధ వ్యక్తులకు చెందిన 8 ఫొటోలు, బ్యాంక్ పాస్‌బుక్స్ 12, బైక్, కంప్యూటర్, రూ. 11 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.