
'నా కూతురు కేసును సీబీఐకి ఇవ్వండి'
గుంటూరు: తన కూతురు రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రిషితేశ్వరి తండ్రి మురళీ కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ను, అర్బన్ ఎస్పీని కలిసి ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు. అభిషేక్ అనే విద్యార్థి కూడా తన కూతురుతో అసభ్యకరంగా వ్యవహరించినట్లు డైరీలో రాసినందున అతడ్ని కూడా విచారించాలని కోరారు.
లైంగిక వేధింపులు, ర్యాగింగ్ ను ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ బాబూరావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు కేసును హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు. ఇవన్నీ పూర్తయ్యే వరకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు. ర్యాగింగ్ నిరోధక చట్టంలోని అంశాలను పకడ్బందీగా అమలు చేయాలని కూడా మురళీకృష్ణ వినతిపత్రంలో పేర్కొన్నారు.