తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డ: మోదీ
గజ్వేల్: తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డ అని ప్రధాని మోదీ అన్నారు. భారత దేశంలో అతి తక్కువ వయసున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్నవారందరినీ తెలుగులో సంబోధించడమే కాకుండా సభకు వచ్చిన ప్రజలందరికీ తెలుగులో శుభాకాంక్షలు చెప్పారు. ఇక్కడ ఐదు పథకాలు ప్రారంభించడంతో తనకు ఈ రోజు పంచభూతాల దర్శనం అయిందని చెప్పారు.
కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. దీనిని సహకార సమాఖ్య అంటారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పనులు చేపట్టిందని అన్నారు. అవన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన దగ్గరకు వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి గురించి మాట్లాడేవారని అన్నారు. కేసీఆర్ సీఎం అయినప్పటి నుంచి నన్ను కలిసినప్పుడల్లా ఇదే విషయం మాట్లాడేవారని చెప్పారు. నీళ్ల విషయంలో సీఎం కేసీఆర్ భావోద్వేగంతో ఉండేవారని అన్నారు. మిషన్ భగీరథ గురించి చాలా సార్లు చెప్పారని, తన దగ్గరకొచ్చి గుజరాత్ లో మంచినీటి సరఫరా గురించి పరిశీలించేందుకు ఓ టీంను పంపించానని చెప్పారన్నారు.
నీళ్లుంటే మట్టి నుంచి బంగారం తీయొచ్చని వివరించారు. విద్యుత్ కోసం తాము యూనిట్ 11 రూపాయలు చెల్లించాల్సి వచ్చేదని తాము తెచ్చిన సంస్కరణలతో 1.45రూపాయలకు ఇప్పుడు ఒక యూనిట్ విద్యుత్ లభిస్తోందని అన్నారు. చాలా ఏళ్లుగా కోరుకుంటున్న రైల్వే లైన్ ఇప్పటి వరకు రాలేదని, నేడు దానికి శంకుస్థాపన జరిగిందని, గతంలో ఎందరు ప్రధానులు వచ్చిపోయినా ఇలా జరగలేదని, ఈ రైల్వే లైన్ కు మోక్షం కలగలేదని అన్నారు.
దేశం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రైల్వేకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి ఫర్టిలైజర్ ప్లాంట్ ప్రారంభకాబోతుందని, గతంలో వచ్చిన వారు చెప్పినా అవి మాటలకే పరిమితమయ్యాయని అన్నారు. సబ్సిడీకి ఎరువులు ఇస్తామని మోసం చేశారని, కానీ తాము ఎరువులు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించినట్లు వివరించారు. ఇప్పుడు ఏ సీఎంలు యూరియా కోసం కేంద్రానికి లేఖ రాయడం లేదని, సీఎం కేసీఆర్ లాంటి వారు కేంద్రంలో అవినీతి లేదని అంటున్నారని చెప్పారు.