
పోలీసులు చితకబాదారు
– స్టేషన్ ఎదుట బాధితుడి బంధువుల ఆందోళన
నల్లమాడ : మండలంలోని కుటాలపల్లి మందలో నివాసం ఉండే టీడీపీ కార్యకర్త, వార్డు మెంబర్ నాగభూషణను రెండు రోజుల క్రితం పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. శనివారం క్షతగాత్రున్ని స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట పడుకోబెట్టి పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వాల్మీకి సంఘం నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన కులస్తులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ విషయమై ఎస్‌ఐ గోపీ మాట్లాడుతూ నాగభూషణకు తగిలిన దెబ్బలు, అనారోగ్య పరిస్థితితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. క్షతగాత్రుడు నాగభూషణ ఫిర్యాదు మేర కు వారి ఇంటి పక్కన నివాసం ఉండే జీ శివారెడ్డి, శివనాథంరెడ్డి అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నాగభూషణ పెంచుకుటున్న వేట కుక్కలకు ఇటీవల ఎవరో మందుపెట్టి చంపడంతో నాగభూషణ, అతని భార్య మహిత ఆవేదనతో ఇంటివద్ద తిట్టుకుంటూ ఉండేవారన్నారు. తమనే తిడుతున్నారని భావించిన శివారెడ్డి, శివనాథంరెడ్డిలు నాగభూషణ, అతడి భార్యపై దాడిచేసి తీవ్రంగా కొట్టారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.