ఒకే గూటిలో పోలీసు కార్యాలయాలు
ఒకే గూటిలో పోలీసు కార్యాలయాలు
Published Sat, Jun 3 2017 10:51 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
20 ఎకరాలలో నూతన భవనాల నిర్మాణం
అర్బన్ ఎస్పీ, డీఎస్పీలు, సీఐడీ, ఆయుధగారం.. అన్నీ అక్కడే
సీఎం చంద్రబాబుతో ప్రారంభించేందుకు యత్నం
రాజమహేంద్రవరం పోలీస్ అర్బన్ జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మిస్తున్నారు. లాలాచెరువు వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఓఎన్జీసీ బేస్ క్లాంప్లెక్ వద్ద 20 ఎకరాల స్థలంలో అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయం, డిస్ట్రిక్ ఆర్మ్‌డ్ రిజర్వు పోలీస్ కార్యాలయం (డీఏఆర్), సీఐడీ కార్యాలయం, ఆయుధగారం కార్యాలయాలు కొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటివరకూ కొన్ని డీఎస్పీ, సీఐడీ తదితర కార్యాలయాలు అద్దె భవనాలలో నిర్వహిస్తున్నారు. ఒకేచోటు అన్ని కార్యాలయాలు ఉండడం వల్ల ప్రజలకు సౌలభ్యంతో పాటు, ప్రభుత్వానికీ అద్దెల భారం తగ్గుతుంది. డీఎఆర్ కార్యాలయం, ఆయుధగారాలు నూతన భవనాలు శిథిలావస్థకు చేరాయి. రూ.14 కోట్లతో ఎస్పీ కార్యాలయం, ఆయుధగారం, డీఏఆర్ కార్యాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ కార్యాలయాలను సీఎం చంద్రబాబుతో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : డిస్ట్రిక్ పోలీస్ ఎస్పీ కార్యాలయాన్ని పూర్తి హంగులతో 27 వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు. భవనం ముందు భాగంగా గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. ఎస్పీ, ముగ్గురు అడిషినల్ ఎస్పీలకు ప్రత్యేక చాంబర్లు, క్రైం, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచి, ఇతర శాఖల డీఎస్పీలకు కూడా చాంబర్లు కేటాయించారు. ఈ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్, పరిపాలనకు సంబంధించిన ఏ,బీ,సీ,డీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు.
సీఐడీ కార్యాలయం...
ప్రస్తుతం ఏవీ అప్పారావు రోడ్డులో అద్దె భవనంలో ఉన్న సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి ఈ ప్రాంగణంలో ఎకరం స్ధలం కేటాయించారు. దీనిలో 17 వేల చదరపు గజాల స్థలంలో జీ ప్లస్-1 తో రూ.3.40 కోట్లతో నిర్మించారు. ఈ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీ కార్యాలయం, డీఎస్పీ గదులు, కాన్ఫరెన్స్ హాల్, మల్టీపర్పస్ రూమ్స్, సీఐలు, ఎస్సైలకు ప్రత్యేక గదులు, లాకప్ రూమ్, ఇంటరాగేషన్ రూమ్ నిర్మించారు.
డీఏఆర్ కార్యాలయం
ఆశోకా థియేటర్ వద్ద శిథిలావస్థలో ఉన్న పురాతన భవనంలో ప్రస్తుతం డిస్ట్రిక్ ఆర్మ్‌డ్ పోలీస్ కార్యాలయం ఉంది. పోలీస్ కార్యాలయ సముదాయంలో 22 వేల చదరపు గజాల స్థలంలో ఈ కార్యాలయానికి భవనం నిర్మించారు. ఈ భవనంలో డీఏఆర్ డీఎస్పీ, ఎంఆర్, ఆర్‌ఎస్సైలు, ఆర్‌ఐల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోలీస్ బ్యాండ్ కోసం ప్రత్యేక రూమ్, క్లాస్ రూమ్‌లు నిర్మించారు. వీటిని మహిళా, పురుష పోలీసులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
ఆయుధగారం...
ప్రస్తుతం ఆశోకా థియేటర్ వద్ద పురాతన భవనంలో ఉన్న ఆయుధగారాన్ని నూతన భవనంలోకి మార్చనున్నారు. 8 వేల చదరపు గజాల స్థలంలో నిర్మించిన ఈ భవనానికి సంఘ వ్యతిరేక శక్తులు దాడిని తట్టుకునేలా ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ ఉంటుంది. భవనం కింద భాగంలో ఆయుధాలు ఉంచేందుకు స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేశారు. భవనం పరిసరాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పేరేడ్ గ్రౌండ్, షెడ్లు, ఈ ప్రాంగణంలో ఉన్నాయి.
సోలార్ సిస్టమ్...
ఈ కార్యాలయాలకు మొత్తం సోలార్ సిస్టం ద్వారా విద్యుత్‌ను అందించనున్నారు. భవనంపైనే సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. రూ.65 లక్షలతో 100 కేవీ సోలార్ సిస్టం ఏర్పాటు చేశారు. దీని ద్వారా అన్ని కార్యాలయాలకు విద్యుత్ సరఫరా చేస్తారు.
Advertisement
Advertisement